Showing posts with label మా బతుకులు - ఒక దళిత స్త్రీ ఆత్మకథ. Show all posts
Showing posts with label మా బతుకులు - ఒక దళిత స్త్రీ ఆత్మకథ. Show all posts

Sunday, 22 October 2017

దళిత మహిళ తొలి ఆత్మకథ - ఆదివారం ఆంద్ర జ్యోతిలో (22-10-2017) చందు తులసి సమీక్ష

దళిత మహిళ తొలి ఆత్మకథ

వర్ణ వ్యవస్థ సృష్టించిన అత్యంత హేయమైన దురాచారం అంటరానితనం కారణంగా తరతరాల పాటు దళితుల జీవితాలు అంధకారంలో మగ్గిపోయాయి.
ఆధునిక విద్య,దళిత ఉద్యమాలు తీసుకొచ్చిన చైతన్యంతో ఆ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఇప్పటికీ పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతంగా దళిత సాహిత్యాన్ని తీసుకొస్తున్నారు. బాబా అంబేద్కర్ నడిపిన దళిత ఉద్యమంలో తోలి తరం మహిళా కార్యకర్త బేబీ కాంబ్లీ.

ఆమె తన జీవిత కాలంలో మహారాష్ట్రలోని మహర్ల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తూ రాసిన నవల ఇది. జీవా అమూచ అనే పేరుతొ  మరాఠీ పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ  ఆత్మకథ ...  దళిత మహిళ కోణంలోంచి వివరిస్తుంది. తరతరాలుగా దాస్యం,  వేట్టిచాకిరిలో మగ్గిపోయిన మహార్లు ... పేదరికంలో అంత కన్నా రదృష్టకరమైన అంతరానితనంతో దుర్భరంగా జీవించిన వారు, అంబేద్కర్ అందించిన చైతన్యంతో ఉద్యమాలు చేసి ఆత్మగౌరవాన్ని సాధించడమే సంక్షిప్తంగా ఈ నవల సందేశం.
అటు అగ్ర వర్ణ దురహంకారంతో పాటూ, ఇటు దళిత సమాజంలోనూ మహిళలపై హింస, అణచివేత, పురుషాధిక్య భావజాలం, వివక్ష ... పేరుకుపోయిన తీరును కాంబ్లీ అత్యంత సహజంగా చిత్రించారు. అ రకంగా దీన్ని దళిత మహిళ దృక్కోణం లోంచి వచ్చిన మొదటి ఆత్మకథగా చెప్పుకోవచ్చు. ఒక సాధారణ దళిత మహిళ జీవితం ఆత్మకథగా రావడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. మరాఠా పత్రికలో వచ్చిన ఈ రచన తెలుగు లోకి రావడానికి నలభై ఏళ్ళు పట్టడం గమనార్హం .

- చందు తులసి
ఆదివారం ఆంధ్రజ్యోతి



Sunday, 29 January 2017

కులం, వర్గం, దోపిడీ అనే మూడు దుర్మార్గాలపై సాగిన ఆత్మకథ - చల్లపల్లి స్వరూప రాణి

రెండు నెలల్లో పుస్తకాన్నిఅనువదించడం గొప్ప విషయం - మా బతుకులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇఫ్లూ యునివర్సిటీ ప్రొఫెసర్, మహిళా ఉద్యమకారిణి సుజీ తారు
ఆంధ్ర జ్యోతి 29-1-2017 సౌజన్యం తో ...
http://epaper.andhrajyothy.com/1086505/Hyderabad-City/29.01.2017#page/20/2



Friday, 27 January 2017

మా బతుకులు పుస్తకావిష్కరణ సభ ఈ రోజే సాయంత్రం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో


మా బతుకులు పుస్తకావిష్కరణ సభ ఈ రోజే సాయంత్రం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో .

ఈ సందర్భంగా ఈ రోజు (28 జనవరి 2017) నవ తెలంగాణా దినపత్రిక మనవి పేజీలో వెలువడిన
పుస్తక పరిచయం:


http://epaper.navatelangana.com/1085468/NavaTelangana/28.01.2017#page/5/1



Monday, 23 January 2017

బతుకు గాయాల గాథ " జీనా అమూచ"

బతుకు గాయాల గాథ " జీనా అమూచ"

బేబీ కాంబ్లే మరాఠీ రచన "జీనా అమూచ" కు తెలుగు అనువాదమైన "మా బతుకులు- దళిత స్త్రీ ఆత్మకథ"  పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 28 జనవరి 2017 శనివారం సాయంత్రం 5. 30 గంటలకు జరుగనున్న సందర్భంగా
నమస్తే తెలంగాణా 23 -1 - 2017 సంచిక లో వెలువడిన పరిచయ వ్యాసం:

http://epaper.namasthetelangaana.com/c/16289384



Sunday, 22 January 2017

దళిత స్త్రీవాదాన్ని ఎత్తిపట్టిన మొదటి ఆత్మకథ

జనవరి 28 శనివారం సాయంత్రం 5.30 కి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
బేబీ కాం బ్లే "మా బతుకులు" పుస్తకావిష్కరణ జరుగనున్న సందర్భంగా
ఈరోజు ( 23-1-2017 ) సాక్షి దినపత్రికలో వెలువడిన కే.సత్యనారాయణ గారి పరిచయ వ్యాసం:


సాక్షి 23-1-2017 పేజి 4 :





హైదరాబాద్ లో మా బతుకులు పుస్తకావిష్కరణ, ఒంగోలు లో గుజరాత్ ఫైల్స్ పుస్తకం పై చర్చ

హైదరాబాద్ లో మా బతుకులు పుస్తకావిష్కరణ, ఒంగోలు లో గుజరాత్ ఫైల్స్ పుస్తకం పై చర్చ గురించి ఈరోజు 23-1-2017  ఆంద్ర జ్యోతి లో వెలువడిన ప్రకటన


Thursday, 19 January 2017

ఒక దళిత స్త్రీ ఆత్మకథ " మా బతుకులు " పుస్తకావిష్కరణ సభ

బేబీకాంబ్లే ఆత్మకథ ''మా బతుకలు'' పుస్తకావిష్కరణ సభ 28 జనవరి 2017 శనివారం సాయంత్రం 5-30 గంటలకు హైదరాబాద్‌ - బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్బులో

అందరికీ ఇదే మా ఆహ్వానం

మలుపు ప్రచురణలు (98 66 55 98 68)









Wednesday, 23 November 2016

మూడు తరాల మహర్ మహిళల బతుకు పోరాట చిత్రణ : 'మా బతుకులు '

 మా బతుకులు పుస్తకానికి శ్రీ కె. సత్యనారాయణ రాసిన ముందుమాట :


దళిత స్త్రీ వాదాన్ని ఎత్తిపట్టిన మొదటి ఆత్మకథ

అంబేద్కర్‌ నడిపిన చారిత్రాత్మక దళిత ఉద్యమంలో తొలితరం మహిళా కార్యకర్త బేబికాంబ్లే. ఆమె రాసిన 'మా బతుకులు' తెలుగులోకి చాలా ఆలస్యంగా వస్తోంది. మరాఠీ దళిత సాహిత్యం నుంచి కొన్ని కవితలు, కథలు తెలుగులోకి వచ్చాయి

కానీ ఆత్మకథలు, నవలలు రాలేదు. ఆలస్యంగానైనా దళిత ఆత్మకథ తెలుగులోకి రావడం ఆహ్వానించదగినది. దళిత ఉద్యమం తెచ్చిన సామాజిక మార్పుని చిత్రించిన 'మా బతుకులు' వెలుగులోకి రావటమే ఒక చరిత్ర. బేబీ కాంబ్లే తన భర్తతో పాటు చిన్న కిరాణా షాపు నడుపుకునేది. పెద్దగా చదువుకోలేదు. అంబేద్కర్‌ ఉద్యమంలో పని చేసింది. తన జీవిత కాలంలో మహర్ల జీవితంలో వచ్చిన మార్పుల్ని తన అనుభవాల రూపంలో రాసింది. 1960లలోనే చాలా నోట్స్‌ పుస్తకాలు నింపేసింది. తన రాతలను భర్త చూస్తే అభ్యంతర పెడతాడని ఆ నోట్స్‌ పుస్తకాలని పాత పుస్తకాలు, పత్రికలతో పాటు అటకపై దాచేసింది. 1980లలో మహారాష్ట్రలో పరిశోధన చేయటానికి వచ్చిన సామాజిక శాస్త్ర పరిశోధక విద్యార్థి మాక్సీన్‌ బెర్నస్టీన్‌ బేబీ కాంబ్లేను కలిసింది. బేబీకాంబ్లే చెప్పిన ఉద్యమ అనుభవాల్ని విని, ఈ అనుభవాల్ని రాస్తే బాగుంటుందని అన్నది.

అది విన్న బేబీకాంబ్లే తాను ఎప్పుడో రాసానని చెప్పింది. బెర్నస్టీన్‌ ఆ పుస్తకాల్ని తెప్పించుకుని చదివింది. ఒక మహిళా పత్రికతో మాట్లాడి ఈ ఆత్మకథని 1982లో ధారావాహికంగా ప్రచురించడానికి సహాయపడింది. జీనా అమూచ 'మా బతుకులు' పేరుతో మరాఠీలో పుస్తకరూపంలో 1986లో వచ్చింది. మరాఠీ సాహిత్యంలో, బహుశా భారతీయ భాషల్లోనే దళిత మహిళ రాసిన మొదటి ఆత్మ కథగా దీన్ని చెప్పవచ్చు. ఈ పుస్తకాన్ని ''ది ప్రిజన్స్‌ వియ్‌బ్రోక్‌'' (మేము బ్రద్దలుకొట్టిన జైళ్ళు) పేరుతో 2008లో ఇంగ్లిష్‌లో ప్రచురించారు. 'మా బతుకులు' రాసిన తరువాత 20 ఏళ్ళకు మరాఠీ భాషలో పుస్తక రూపంలో వచ్చింది. మరో 20 ఏళ్ళ తరువాత ఇంగ్లిష్‌లో ప్రచురితమైంది. దళిత మహిళల అనుభవాలు,

ఆలోచనలు వెలుగులోకి రావటం ఎంత కష్టమో 'మా బతుకులు' ప్రచురణ చరిత్ర చదివితే, అర్థమవుతుంది.
ఆత్మకథ
మరాఠీ దళిత సాహిత్య చరిత్రలో ఆత్మకథా ప్రక్రియ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఆత్మకథా ప్రక్రియ అనగానే ''ప్రముఖులు'', తత్త్వవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, అందులోనూ పురుషుల వ్యక్తిగత జీవిత చరిత్రని రికార్డు చేసే రూపంగా మనకి తెలుసు. అరకొర చదువులతో, సాధారణ వ్యక్తులైన దళితులు తమ జీవిత చరిత్రలు రాసి ఆ మొదటి ప్రయత్నంతో రచయితలుగా ఎదిగారు. ఆత్మకథా ప్రక్రియ రూపురేఖల్ని మార్చి వేసారు. ఈ ప్రక్రియ చుట్టూ ఏర్పరిచిన సరిహద్దుల్ని చెరిపేసారు. సాధారణ దళితుల జీవితాన్ని కథా వస్తువు చేసారు. మరాఠీలో దయాపవార్‌ రాసిన 'బలూత' శరణ్‌ కుమార్‌ లింబాలే రాసిన 'అక్కర్‌ మాషీ' లాంటి ఆత్మకథలు సంచలనం సృష్టించాయి. సాధారణ వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా మొత్తం  దళితుల సామూహిక జీవన దృశ్యాన్ని చిత్రించే ప్రయత్నం చేసాయి. అయితే దళిత ఆత్మకథలు అగ్రకుల సమాజపు దౌర్జన్యం, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, సామాజిక మార్పు కోరడాన్ని చూపించాయి. ఈ కథలన్నీ దళిత పురుషుల దృష్టి కోణం నుంచి దళిత జీవితాన్ని, సమాజాన్ని విశ్లేషిస్తాయి. 'మా బతుకులు' దళిత మహిళ దృష్టికోణం నుంచి, దళిత మహిళల జీవితం కేంద్రంగా దళిత జీవితాన్ని, మొత్తంగా సమాజపు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అగ్రకుల ఆధిపత్యంపై విశ్లేషణతో పాటు, దళిత సమాజంలో ఉన్న అసమానతల్ని, వివక్షా రూపాల్ని, హింసని కలిపి చిత్రించడం ఒక రచయితగా బేబీ కాంబ్లే సాధించిన విజయం. సమాజంలోని హింసా, దౌర్జన్యాలు, పితృస్వామ్య ధోరణులు, లింగ వివక్ష దళిత సమాజంలో కూడా ప్రతిఫలించిన తీరుని ఆమె విమర్శించారు. అందుకే మా బతుకులు దళిత స్త్రీ వాద దృక్పథం నుంచి రాసిన మొదటి ఆత్మకథగా చెప్పవచ్చు.

'మా బతుకులు'లో మహారాష్ట్రలో అంటరాని కులస్థులైన మహర్ల జీవితాన్ని రెండు భాగాలుగా విభజించి చూపించారు.

మొదటి భాగంలో మహర్ల సాంప్రదాయక సంస్కృతి, జీవితం, రెండవ భాగంలో అంబేద్కర్‌ ఉద్యమ వెలుగులో మహర్లు ఆధునికతవైపు అడుగులు వేయటాన్ని చూడవచ్చు. పేదరికం, అంటరానితనం, అజ్ఞానంతో బతుకుతున్న మహర్లు, అంబేద్కర్‌ ఉద్యమానికి, ఆలోచనలకి ఆకర్షితులై చైతన్యవంతులుగా ఎదిగి మానవ మర్యాద, ఆత్మగౌరవం సాధించుకున్నతీరు 'మా బతుకులు' ఇతివృత్తంగా చెప్పవచ్చు.

మహర్ల జీవితం

మహారాష్ట్రలోని పూనా సమీపంలో గల వీర్‌గాంవ్‌ గ్రామంలోని మహర్ల జీవితం గురించి బేబీకాంబ్లే రాసింది. ఆ గ్రామంలో తన అమ్మమ్మ గారి ఇంట్లో ఆమె పుట్టింది. వీర్‌గాంవ్‌ మహర్‌వాడ, అక్కడి మహర్‌ కుటుంబాల జీవిత చరిత్రను 'మా బతుకులు'లో చిత్రించింది. బేబీకాంబ్లే తన వ్యక్తిగత జీవిత వివరాల కంటే మహర్‌ కుల ప్రజల జీవిత చరిత్రకే ప్రాధాన్యత ఇచ్చింది. మహర్ల జీవిత చరిత్రలోనే ఆమె జీవిత చరిత్ర ఉందని ఆమె భావించింది.

అంటరానితనం, కులవివక్ష, పేదరికం, అజ్ఞానంలో బతుకుతున్న మహర్లు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ప్రతి కుటుంబానికి 8 నుంచి 15 మంది పిల్లలు ఉంటారు. పూరి గుడిసెల్లో సరైన బట్టలు, వంట పాత్రలు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆనాటి  మహర్లని చూస్తే ''ఎలుకలు కొరికేసిన గుడ్డ బొమ్మల్లాగుంటారు. చిక్కులు పడిన వాళ్ళ జుట్టులో నిండుగా పేలు, ఈళ్ళతో నిండిపోయి ఉంటాయి. వాళ్ల పిల్లలు బురదలో పొర్లించినట్టున్నారు. ఆ పిల్లల ముక్కుల్లోంచి చీమిడి కారుతూ ఉంటుంది.'' అగ్రకుల పాటిల్‌, బ్రాహ్మణ తదితర అగ్రకులాల వారు మహర్లని కట్టు బానిసలుగా చేసుకున్నారు. వారి శ్రమను దోచుకుంటున్నారు. బ్రాహ్మణీయ భావజాలం తరతరాలుగా రుద్దబడడం వల్ల, మహర్లు ఆ భావజాలానికి పూర్తిగా బానిసలైపోయారు. తమను తాము బానిసలుగా భావించుకునే భావదాస్యంలోకి నెట్టబడ్డారు. తాము మనుష్యులమే అనే స్పృహ కోల్పోయారు.

మహర్‌ కులంలో మహిళలది చాలా కీలకమైన పాత్ర. కుల సంప్రదాయాలు, ఆచారాలు పాటించడంలో వారు చాలా నిష్టగా ఉంటారు. ఆషాడ మాసంలో జరిగే 'పవిత్ర' స్నానాలు, ఆచారాల గురించి చాలా వివరమైన, సుదీర్ఘమైన వర్ణనలు ఉన్నాయి. స్నానం తరువాత గోచిగుడ్డ, చింకిపాతల చీరలే, కొత్త దుస్తులుగా కట్టుకుంటారు. కాని సంప్రదాయ పద్ధతుల్ని, నియమాల్ని ఆచరిస్తారు. పండగలకు, జాతర్లకు అలంకరణ చేయడం, వంటలు, నైవేద్యం తయారు చేయడం నుంచి అమ్మవారిలా పూనకం ఊగే వరకు అన్ని రకాల మంత్రతంత్రాలు, తంతుల్లో మహర్‌ మహిళలు పాల్గొంటారు. ఇవే రకమైన తంతు, ఆచారాలు పెళ్ళిళ్ళ సమయంలో, బాలింతలకి పురుడు పోసేటపుడు మహర్‌ మహిళలు పాటిస్తారు. తమను తాము హిందువులుగా భావించుకునే మహర్‌ కులంలో సంప్రదాయాల్ని, మతాచారాలను పాటించి, కొనసాగించడంలో మహిళలదే ప్రధాన పాత్ర. ఒక ప్రక్క కుటుంబ పనులు, పిల్లల ఆలన పాలన చూసుకుంటూ, ఈ సంప్రదాయపు తంతులన్నీ ఆచరిస్తారు.

హిందూ సంప్రదాయాలను అరకొరగా ఆచరిస్తూ, భావదాస్యంలో మహర్లు మగ్గిపోతున్నారని చెప్పటానికి బేబీకాంబ్లే గత కాలపు మహర్ల ఆచారాన్ని, తంతుల్ని వివరంగా వర్ణించారు.  అగ్రకులాల్ని అనుకరించడంలో మహర్లలో పూర్తి అజ్ఞానం ఉందని, ఈ అజ్ఞానం పేదరికానికి తోడై తమను తాము తక్కువ వారిగా బానిసలుగా భావించునే స్థితిని రచయిత చక్కగా చూపించారు.

ఈ ఆత్మకథలో మూడు తరాల మహర్‌ మహిళలు కనిపిస్తారు. అమ్మమ్మలు / నాన్నమ్మలు, అమ్మలు / అత్తలు, కూతుళ్ళు / కోడళ్ళు. చిన్న వయస్సులోనే శ్రమకు, కష్టాలకు, అణచివేతకు గురయ్యే కూతుళ్ళు, కోడళ్ళ గురించి కొంత తెలుసుకోవాలి. మహర్‌ కులంలో అమ్మాయిలకు 7 లేదా 8 ఏళ్ళకే పెళ్ళయిపోతుంది. శారీరకంగా ఎదగకుండానే వారు గర్భవతులవుతారు... అనేక అనారోగ్య సమస్యలతో వారిలో చాలా మంది ప్రసవ సమయంలో చనిపోతారు. మంత్రసానుల నాటు పద్ధతుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక కోడళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వేకువ

జామునే లేచి జొన్నలు దంచాలి. రొట్టెలు చేయాలి. నీళ్ళు మోసుకురావాలి. మొత్తం ఇంటి పనంతా కొత్త కోడలే చేయాలి.

అత్తగారు, ఆడపడుచులు, బావగార్ల తిట్లు, వేధింపులు భరించాలి. ఈ పని వత్తిడి, వేధింపులు భరించలేక కొందరు కొత్త కోడళ్ళు పారిపోతారు. వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తారు. మహర్‌వాడలో ప్రతి ఇంటి నుంచి కోడళ్ళ ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయి. కొందరి తలలు పగలడం, ఎముకలు విరగడం, వారు స్పృహతప్పి పడిపోవడం సర్వసాధారణం.

మహర్‌ జీవిత చిత్రణలో తన జ్ఞాపకాల్ని అనేక దృశ్యాలుగా, వివరమైన వర్ణనలతో చూపించారు. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి, పెళ్ళిళ్ళలో మిగిలిన ఆహారం తినడం, చచ్చిన గొడ్డు మాంసాన్ని దాచుకుని రోజుల తరబడి తినడం, ఆకలితో చావలేక బ్రహ్మజెముడు కాయలు తిని కడుపు పాడై ఇబ్బందులకు గురి కావడంలాంటి అనేక విషయాల్ని బేబికాంబ్లే విపులంగా వర్ణించారు. ఇలాంటి బతుకులపై వ్యాఖ్యానం, వివరణ, అభిప్రాయాల ప్రకటన కంటే వివిధ దృశ్యాలను వర్ణించడమే తన రచనా పద్ధతిగా ఎన్నుకున్నారు. ఈ పద్ధతి వల్ల మహర్ల అమానవీయ బతుకును బాగా చూపడం, ఆ బతుకుల్ని మార్చే చైతన్యాన్ని ఇచ్చిన అంబేద్కర్‌ ఉద్యమాన్ని ఎత్తిపట్టడం బేబీకాంబ్లే ఉద్దేశ్యం కావచ్చు. అందుకే - మహర్లు  తోకలేని జంతువులుగా బతికారని అంటుంది.

మనమూ మనుషులమే

''జంతువులుగా జీవిస్తున్న వారిని మనుషులు''గా అంబేద్కర్‌ మార్చారని బేబీకాంబ్లే అంటుంది. చిన్న బాలికగా ఉన్నపుడు అంబేద్కర్‌ ఒక సమావేశంలో చేసిన ప్రసంగాన్ని బేబీకాంబ్లే విన్నది. ఆయన మాటల్ని ఆచరణలో పెట్టింది.

అంబేద్కర్‌ ''మనమూ మనుషులమే. మనకూ మనుషులుగా జీవించే హక్కు'' ఉందని ప్రకటించారు. ఆత్మగౌరవంతో బతకలేకపోతే చావడం మేలన్నాడు. చచ్చిన గొడ్డు మాంసాన్ని తినవద్దన్నాడు. తిండిలేక కొందరు చనిపోయినా, బతికిన వారు గౌరవంగా, మర్యాదతో బతుకుతారని అన్నాడు. ఈ బానిస బతుకు మనపై రుద్దబడింది. ఇది పోవాలంటే పోరాటం తప్పదన్నాడు. ముఖ్యంగా ఈ విప్లవాత్మక సంస్కరణలో మహిళలే ముందుండాలి అన్నాడు. జాతిని మేల్కొలిపి, పోరాటాల ద్వారా చైతన్యపరిచి మహర్‌ కుల ప్రజల్ని ఆధునికత వైపు నడిపించాడు. ఈ ఆత్మకథలో అంబేద్కర్‌ ఒక పాత్రగా చారిత్రక వ్యక్తిగా ఉద్యమ ప్రతీకగా కనిపిస్తారు. అంబేద్కర్‌ సందేశం 1940ల్లో మహర్‌ కులస్థులలో పెద్ద దుమారం లేపింది.

విదేశాల నుంచి వచ్చాడు, క్రిష్టియన్‌గా మారి అంబేద్కర్‌ మైలపడ్డాడని కొందరు మహర్‌ పెద్దలు ఆయన సందేశాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్‌ సందేశం మెల్లగా మార్పుకి దారి తీసింది. పిల్లలకి పైజామాలు తొడగడం, క్రాపు చేయించడం, వారిని స్కూలులో చేర్పించడం లాంటి పనులన్నీ మొత్తం మహర్‌ కుల సమాజాన్ని ఆధునీకరించింది. ఈ అంటరాని బతుకులు తమ తలరాత కాదని, ఖర్మ అసలే కాదని మహర్లు తెలుసుకున్నారు. మనుషులుగా మర్యాదను పొందారు. ఈ పోరాటంలో బేబీ కాంబ్లే లాంటి ఎందరో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించారు.

అంబేద్కర్‌ జయంతినాడు తెల్లని బట్టలు ధరించి ఆత్మగౌరవంతో నడుస్తూ కొత్త మనుషుల్లా మహర్‌లు కనిపించడంతో కథ ముగుస్తుంది. కొస మెరుపుగా, చుదువుకున్న దళితులు స్వార్థంతో జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించింది ఇదేనా? అని బేబి కాంబ్లే ప్రశ్నిస్తుంది.

అంబేద్కర్‌ హిందూ మతాన్ని, బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించి, పోరాడాడని మనకు తెలుసు. కానీ 'మా బతుకులు'లో బ్రాహ్మణీయ భావజాలాన్ని పూర్తిగా జీర్ణించుకొని, తమను తాము బానిసలుగా భావించుకునే మహర్‌ కుల స్థుల మనస్సుల్లో అంతర్భాగమైన అజ్ఞానాన్ని, న్యూనతాభావాన్ని, భావదాస్యాన్ని సమూలంగా తొలగించడాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. అగ్రకులాల అణచివేత ప్రస్తావన ఉంటుంది కాని అగ్రకులాలతో ఘర్షణలు, పోరాటం ఈ పుస్తకంలో ప్రధానం కాదు. మహర్‌ల మానసిక, సాంస్కృతిక, భావజాల బానిసత్వాన్ని తొలగించడంలో అంబేద్కర్‌ విప్లవాత్మక పాత్ర నిర్వహించారు. బేబీ కాంబ్లే లాంటి అనేక మంది మహర్‌ మహిళలు అంబేద్కర్‌ ఉద్యమంలో నిర్వహించిన చారిత్రాత్మక కర్తవ్యాన్ని 'మా బతుకులు' ఎత్తి పట్టింది.బేబీ కాంబ్లే చేయి తిరిగిన రచయిత కాదు. కానీ ఈ పుస్తకం చదివితే అలా అనిపించదు. వివిధ దృశ్యాల చిత్రణలో, వర్ణనలో, వ్యంగ్య వాఖ్యానాల్లో ఆమె రచనా పటిమ కనిపిస్తుంది. మహిళా దృష్టి కోణం నుంచి కథ నడిపించి ఆత్మకథా ప్రక్రియను పునర్నిర్వచించడంలో బేబీ కాంబ్లే ప్రతిభ గొప్పది. సరళమైన మంచి తెలుగులో అనువదించి 'మా బతుకులు' తెలుగు పాఠకులకి అందించిన అనూరాధ గారికి, ప్రచురించిన మలుపు ప్రచురణల వారికి ప్రత్యేక అభినందనలు.


- కె. సత్యనారాయణ
ఇ.ఎఫ్‌.ఎల్‌. యూనివర్సిటీ,
హైదరాబాద్‌.
30/10/2016

అనువాదం : బి. అనురాధ
వెల : రూ. 130  


ప్రతులకు, వివరాలకు : 
 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com

Tuesday, 22 November 2016

డా.బి.ఆర్.అంబేడ్కర్ తో కలసి పనిచేసిన ఒక దళిత స్త్రీ ఆత్మకథ "మా బతుకులు"



మా బతుకులు
ఒక దళిత స్త్రీ ఆత్మకథ

మాకు నాలుగు కాళ్లు కాక
రెండే కాళ్లు వుండటం వల్ల మాత్రమే మమ్మల్ని మనుషులు అనవలసి వస్తోంది.

వాళ్ల పెరట్లో కట్టేసి వుంచే ఎద్దుల కంటే హీనమైన పరిస్థితికి మమ్మల్ని దిగజార్చారు.
కనీసం ఎద్దులకి ఎండుగడ్డయినా వేస్తారు.
మాకు మాత్రం ఎంగిలి మెతుకులే గతి.

అయితే తేడా ఏంటంటే ఎడ్లు కడుపునిండా తిని వాళ్ళ యజమానుల పెరటిలోనే వుంటాయి.
మేము ఉండేది ఊరవతల పెంటకుప్పల్లో.

అగ్రకులాలు ఆ పెంటకుప్పల మీదికి విసిరేసే చచ్చిన జంతువులకి మాత్రమే మేము యజమానులం.
ఆ జంతువుల చర్మాలని ఒలిచే హక్కుని నిలబెట్టుకోడానికి మేము కుక్కలతోటి, పిల్లులతోటీ, గెద్దలతోటీ, రాబందులతోటీ కొట్లాడాలి.

ప్రపంచం నిలబడి వుండటానికి కారణం మాత్రం మేమే.
పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రం లాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పి వుంచే సముదాల్ర వంటి వారం మేము.

అందుకే సముద్రానికి దక్కినట్టే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి!

- బేబి కాంబ్లే
(ఈ పుస్తక రచయిత్రి)



ముద్రణ లో వున్న ఈ పుస్తకం గురించిన మరిన్ని వివరాలు త్వరలో

అనువాదం : బి. అనురాధ
వెల : రూ. 130  

ప్రతులకు, వివరాలకు : 
 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com