Saturday 3 October 2015

మరో లోకపు అథో జీవితాలు - సంకెళ్ళ సవ్వడి పై ఆంధ్ర జ్యోతి సమీక్ష


మరో లోకపు అథో జీవితాలు - సంకెళ్ళ సవ్వడి 

'దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు' అన్న సినారె మాటలకి నూట డెభ్భై పేజీల సాక్ష్యం ఈ పుస్తకం. నాలుగున్నరేళ్ళ అరుణ్‌ ఫరేరా జైలు అనుభవాలివి. చిత్రహింసలతో మొదలైన అరెస్టు పర్వం, చివరకు గాలీ వెలుతురూ కూడా చొరబడని విధంగా మారింది.

న్యాయ ప్రక్రియ మీద ఆశ ఉన్నా, అది వివిధ అవరోధాల మధ్య ఊరిస్తూ ఊరిస్తూ కాలహరణం చేస్తూ ఉంటే, ఆశ కూడా నిరాశకు లోనై పోగల సందర్భం అది. అలాంటి అనుభవాల మధ్య నిలదొక్కుకుని, కేసుల మీద కేసుల్లో ఇరికించబడ్డాడు రచయిత.

ఒకసారి విడుదలై కూడా జైలు కాంపౌండ్‌ లోపలనే మళ్లీ అరెస్ట్‌ చేయబడ్డాడు. అయినా కడవరకూ స్ధైర్యం కోల్పోని పోరాటం చేశాడు. కుటుంబంతోనూ, చివరికి లాయర్లతోనూ కూడా మాట్లాడడానికి ఉన్న ఏకైక మార్గం - ములాఖాత్‌లు - ఎంత దుర్భరంగా ఉంటాయో ఇందులో చదవవచ్చు.

పోలీసులు ఉపయోగంచే నార్కో అనాలిసిస్‌ పద్ధతులూ, ఇతర ఆమానవీయ చిత్రహింసా మార్గాలూ; జైళ్లలో ఉండే అవినీతీ, అధికారం, దాని దుర్వినియోగం, కాలం చెల్లిన జైలు మాన్యువల్స్‌, ఉత్తరాలు రాసుకోవడం మీద ఉండే సెన్సార్‌ వాటిల్లోని జాప్యాలూ - ఇవన్నీ ఈ రచనలో ఉన్నాయి.

తీవ్రవాదానికి సంబంధించిన అక్రమ కేసుల్లో ఇరికించబడ్డ పలువురు అమాయకుల గాధలు కూడా ఛాయామాత్రంగా ఇందులో చోటు చేసుకున్నాయి.

రాతలో భావావేశం ఎక్కడా కనబడనీయకుండానే చదివే పాఠకుడిలో ఉద్వేగాన్ని రెచ్చగొట్టగలిగిన స్థాయి కథలివి. ఎన్‌. వేణుగోపాల్‌ అనువాదం కూడా సాఫీగా సాగింది.
మరో లోకపు అథో జీవితాల గురించీ,
దానికి కారణమైన వ్యవస్థ గురించీ
ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

- ఎ.వి.రమణమూర్తి
ఆదివారం ఆంధ్రజ్యోతి 4 అక్టోబర్‌ 2015


సంకెళ్ల సవ్వడి, అరుణ్‌ ఫరేరా,

అనువాదం: ఎన్‌. వేణుగోపాల్‌,
పేజీలు: 171, వెల: రూ. 150,

ప్రతులకు: మలుపు, 2-1-1/5,
నల్లకుంట, హైదరాబాద్‌ - 44

http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MTAwNDEwMDMxMDU5Mjc3NjcuanBn&day=20151004