Friday 18 November 2016

గుజరాత్ ఫైల్స్ పుస్తకం ఇప్పుడు అన్ని ముఖ్యమైన పుస్తకాల షాపుల్లో లభిస్తోంది . ధర కేవలం 130 రూపాయలే!


ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీ కె. శ్రీనివాస్ ఈ పుస్తకానికి  రాసిన ముందుమాట: 




అనధికార చార్జిషీట్‌
ఈ పుస్తకం చదవడం ఒక హింసాత్మక అనుభవం.
వాక్యాల వెంట నడుస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
 పేజీలు తిప్పుతుంటే, వేళ్లు వణుకుతాయి.
అంతులేని నిస్త్రాణ ఆవరించి, పుస్తకం పూర్తయ్యేసరికి భయభ్రాంతులమవుతాము.
రచయిత ప్రదర్శించిన అద్భుత రచనాశైలో, ఉత్కంఠ నింపిన కథనమో అందుకు కారణం కాదు. నిజానికి రచనాపద్ధతిలో పెద్ద విశేషం ఏమీ లేదు. పాఠకులను కల్లోలపరిచేది ఇందులోని విషయమే. అట్లాగని, ఆ విషయం కొత్తదీ కాదు, ఇంతకు మునుపు మన ఊహల్లో అంచనాల్లో లేనిదీ కాదు.

రానా అయ్యూబ్‌ పుస్తకం 'గుజరాత్‌ ఫైల్స్‌' ఇటీవలి దేశచరిత్రకు సంబంధించిన అతి కీలకమయిన పరిణామాలను విస్ఫోటనాత్మకంగా స్పృశించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండ, దాని తరువాత ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లు, వాటితో ప్రమేయం ఉన్న రాజకీయ వ్యక్తులు జాతీయ స్థాయి నాయకులుగా ఎదగడం - వీటిని ఈ పుస్తకం ఒక దృక్కోణంలో కథనం చేసింది.

పరిశోధనాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందిన పత్రిక 'తెహెల్కా' ఉద్యోగిగా అనేక సంచలనాత్మక సత్యాలను వెలికితెచ్చిన యువపాత్రికేయురాలుగా రానా అయ్యూబ్‌ ప్రసిద్ధురాలు. అమిత్‌షా జైలుకు వెళ్లడానికి కారణమయిన కథనాలు కూడా ఆమెవే. గుజరాత్‌ గురించిన మరిన్ని స్పష్టమైన వాస్తవాలను వెలికితీయడానికి ఆమె 2010-11 మధ్యకాలంలో ఆ రాష్ట్రం వెళ్లి మారు పేరుతో, ఔత్సాహిక చిత్రనిర్మాతగా నటిస్తూ ఎంతో ప్రమాదకరమైన పరిశోధన జరిపారు. 2002 మారణకాండ, అనంతర సంఘటనల కాలంలో కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులతో, ప్రజాప్రతినిధులతో ఆమె మాట్లాడారు.

పరిశోధన నరేంద్రమోదీ దాకా చేరిన సమయంలో, 'తెహెల్కా' రానాను వెనక్కు రప్పించింది. ఆమె చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ల కథనాలను ప్రచురించడానికి నిరాకరించింది. మరే పత్రికా, వార్తా ఛానెల్‌ కూడా ఆమె కథనాలను స్వీకరించలేదు. చివరకు తన పరిశోధనను తానే పుస్తకంగా ప్రచురించి, ఈ ఏడాది మేలో విడుదల చేసింది.

పుస్తకం బయటికి వచ్చిన తరువాత కూడా ప్రధాన మీడియా అంతా మౌనమే పాటించింది. ప్రత్యామ్నాయ వేదికలుగా ఉన్న కొన్ని వార్తా వెబ్‌సైట్లు మాత్రమే కొంత పట్టించుకున్నాయి. విస్మరించడం ద్వారానే ఈ పుస్తకంలోని అంశాలను పూర్వపక్షం చేయగలమని నిందితులు కూడా భావించారు.

ఇంగ్లీషు మూలం 'గుజరాత్‌ ఫైల్స్‌: అనాటమీ ఆఫ్‌ ఎ కవర్‌ అప్‌'ను 'ఫస్ట్‌పోస్ట్‌'లో సమీక్షించిన ప్రదీప్‌ మీనన్‌ అనే పాత్రికేయుడు ఇట్లా రాశాడు. ''సూక్ష్మ వివరాల్లోనే దేవుడుంటాడని అంటూ ఉంటారు. వేర్వేరు దేవుళ్లకు చెందిన వారు రానా అయ్యూబ్‌ పుస్తకంలోని సూక్ష్మవివరాలను వేర్వేరుగా చదువుకుంటారు. అయినా సరే, ఈ పుస్తకంలో పూసగుచ్చిన సూక్ష్మాతిసూక్ష్మమైన వివరాలే మీ దృష్టిని కట్టిపడేస్తాయి.''

నిజమే, ఈ పుస్తకంలో చిన్న చిన్న సంగతులు, ముచ్చట్లే ముఖ్యమైనవి. అవే మనకు ఒక సారాంశాన్ని గాఢంగా బట్వాడా చేస్తాయి. తాను సేకరించిన సమాచారాన్ని, జరిపిన సంభాషణల్ని పుస్తకంగా రూపొందించే క్రమంలోను, రాయడంలోను రానా అయ్యూబ్‌ ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ చూపలేదు. మారుపేరుతో ఒక కొత్త ఉనికిని స్వీకరించేటప్పుడు ఎదురయిన ఇబ్బందులు, అన్ని అవరోధాలను విజయవంతంగా అధిగమించినప్పటి విశేషాలు... ఒక్కో సంభాషణ తరువాత తనలో కలిగిన భయోద్విగ్నత - ఈ పుస్తకానికీ నాటకీయతను, ఉత్కంఠను జోడించాయి. వాటి వల్ల పఠనీయత కొంత పెరిగి ఉండవచ్చును కానీ, రానా అయ్యూబ్‌ జరిపిన స్టింగ్‌ సంభాషణలే ఈ పుస్తకానికి ప్రాణం.

గుజరాత్‌ హింసాకాండ సమయంలో హోమ్‌ సెక్రటరీగా పని చేసిన అశోక్‌ నారాయణ్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న జి.సి. రాయిగర్‌, ఒక దళిత ఐఎఎస్‌ అధికారి రాజన్‌ ప్రియదర్శి, హింసాకాండ సమయంలో దుండగుల మూకకు నాయకత్వం వహించినట్టు అభియోగం ఉన్న మాయా కొడ్నానీ, గుజరాత్‌ ఎటిఎస్‌ చీఫ్‌గా పనిచేసిన జి.ఎల్‌. సింఘాల్‌, 2002లో అహ్మదాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌గా ఉండిన పి.సి. పాండే, నాడు రాష్ట్ర పోలీసు డిజిగా పనిచేసిన చక్రవర్తి - వీరందరితోనూ రానా అయ్యూబ్‌ గుజరాత్‌పై తాను నిర్మించాలనుకునే చిత్రం కోసమని చెప్పి ముచ్చటించారు.

ఈ సంభాషణల్లో గుజరాత్‌ హింసాకాండ నేపథ్యం, నరేంద్రమోదీ, అమిత్‌షా పాత్ర ఏ మేరకు ఉన్నది, 2002 తరువాతి కాలంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్ల పూర్వాపరాలు, సూత్రధారులకు, పాత్రధారులకు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌లలో ఉన్న ప్రాబల్యం - వంటి అంశాలు అనేకం ప్రస్తావనకు వచ్చాయి.

వీరిలో కొందరికి నాడు జరిగిన పరిణామాలపై అసంతృప్తీ, వ్యతిరేకతా ఉన్నాయి. అందువల్ల వారు ఇబ్బందులు కూడా పడ్డారు. పనిలో పనిగా ఈ సంభాషణలు, పోలీసు వ్యవస్థలోని కులవివక్షను కూడా చెబుతాయి. ఒక ప్రత్యేకమైన సామాజిక భావధోరణి ఉన్న రాజకీయ నాయకులు అధికారంలో ఉండగా, రాజ్యయంత్రాంగం వారికి ఎట్లా అనుకూలంగా వ్యవహరిస్తుందో, ఆ యంత్రాంగమే ఆ భావధోరణికి ఎట్లా ప్రభావితమవుతుందో, మనుషుల ప్రాణాలపై వారికి ఉండిన పట్టింపు ఎంతో, మొత్తంగా ఆ క్రమం, దేశ రాజకీయ వాతావరణంలో ఏ మార్పులు తెచ్చి, ఎటువంటి అధికార మార్పిడికి కారణమవుతుందో - ఆ సంభాషణలు చదువుతుంటే పాఠకులకు అంచనా కలుగుతుంది.

స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా వాస్తవాలను రాబట్టడం పాత్రికేయ రచనలో ఉత్తమమైన ధోరణి కాదన్న అభిప్రాయం ఉన్నది. ఎదుటివారిని మభ్యపెట్టి, సమాచారాన్ని రాబట్టడం కానీ, అనైతికతకు ప్రలోభపెట్టి కెమెరాకు పట్టించడం కానీ అన్నివేళలా ఉదాత్తమైన మార్గాలు కాకపోవచ్చు. కెమెరా ముందు గానీ, రికార్డర్‌ ముందు గానీ చెప్పిన విషయాలు, ఆ వ్యక్తులు న్యాయస్థానాల్లో ప్రమాణపూర్తిగా తిరిగి చెబుతారా అన్నది ఒక ప్రశ్న. అట్లా చెప్పకపోతే, ఆ సమాచారానికి ఉన్న చట్టబద్ధ విలువ ఏమిటన్నది సందేహం. అయితే, సత్యాన్ని వెలికితీయడానికి అంతకు మించిన మార్గం లేనప్పుడు గత్యంతరం ఏమిటి? ఇటువంటి పుస్తకం పెద్ద సంచలనం తెచ్చి, న్యాయస్థానాలు తమంతట తాము ఇందులోని విషయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తంగా విచారణ జరపమని ఆదేశించగలవా? రానా అయ్యూబ్‌ ఆ ఫలితాన్ని ఆశించారా? ఆశించి ఉండకపోవచ్చు. హింసాకాండపైన, ఎన్‌కౌంటర్లపైన న్యాయస్థానాల్లో ఉన్న వ్యాజ్యాలు విఫలమవుతున్న నేపథ్యంలో తమ పరిశోధన కనీసం వాస్తవాలను రికార్డు చేస్తుందని ఆమె ఆశించి ఉంటారు.

మైనారిటీలపై పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతున్న మూకలను చూసీ చూడనట్టు వదిలివేయమని నాటి ముఖ్యమంత్రి ఆదేశించారా? అంటే, అటువంటి ఆదేశాలు నేరుగా కానీ, లిఖితపూర్వకంగా కానీ ఉండవని, అటువంటి సందేశం తగినవారికి అందేట్టుగా వ్యవహారం నడుస్తుందని ఇందులో ఇద్దరు ముగ్గురు అధికారులు చెప్పారు. ఇక అటువంటి వాటికి కోర్టులు ఆమోదించే సాక్ష్యం ఏముంటుంది? పాఠకులకు విషయం అర్థం కావడమే ఇటువంటి పరిశోధనల ప్రయోజనం. న్యాయస్థానాల్లో నిర్ధారణ కాకపోయినా, ఈ పుస్తకం ఒక తీర్పు వంటిదే. ఈ తీర్పుకు చట్టబద్ధమైన శిక్ష ఉండదు కానీ, పాఠకుల దృష్టిలో అభియోగాల నిర్ధారణ జరిగినట్టే. ఒక చారిత్రక పత్రంగా ఇది వర్తమాన భారత చరిత్రకు సంబంధించిన కొన్ని ఘట్టాల నేపథ్యాన్ని, వాటి పర్యవసనాల్ని ఒక నిర్దిష్టమైన దృక్పథంతో అందిస్తుంది. చరిత్ర ఉన్నంత కాలం, కొన్ని నేరాలకు సంబంధించిన 'ప్రామాణికమైన' కథనంగా నిలుస్తుంది. ఈ దృష్టిలో చూసినప్పుడు రానా అయ్యూబ్‌ విజయవంత మయ్యారు.

స్వతంత్ర భారతదేశంలో అత్యంత అమానవీయమైన, క్రూరమైన హింసాకాండగా పేరు పొందిన గుజరాత్‌ ఘాతుకం నేపథ్యాన్ని ఒకసారి గమనించాలి. కేశూభాయ్‌ పటేల్‌ను దించివేసి, అసెంబ్లీకాలం మధ్యలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ప్రతిష్ఠితులయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే గుజరాత్‌ హింస జరిగింది. ఆ తరువాత కొద్ది నెలలకే ఎన్నికలు జరిగి, మోదీ ఘనవిజయం సాధించారు.

ఆ ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న అమిత్‌షా తమ ప్రాబల్యాన్ని వేగంగా పెంచుకోసాగారు. ఆ సమయంలోనే హోంమంత్రి హరేన్‌ పాండ్య హత్య జరిగింది. ఆ హత్యకు కారకులు ముస్లిం తీవ్రవాదులని చెబుతూ అనేక అరెస్టులు జరిగాయి. గుజరాత్‌ హింసకు ప్రతీకారంగా మోదీ హత్యకు ప్రయత్నిస్తున్నారనే పేరుతో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. అందులో ఇష్రాత్‌ జహాన్‌ అనే యువతి ఎన్‌కౌంటర్‌, సొహ్రాబుద్దీన్‌ అనే చిన్న నేరుస్తుడి ఎన్‌కౌంటర్‌ సంచలనం సృష్టించాయి. సందేహాస్పదమైన ఎన్‌కౌంటర్లతో జాతీయస్థాయిలో వివాదం చెలరేగింది. అమిత్‌ షా అరెస్టు జరిగింది. తరువాత దీర్ఘకాలం ఆయనను గుజరాత్‌లో ప్రవేశించకుండా నిరోధించడం జరిగింది. గుజరాత్‌ హింసాకాండ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కొన్ని తీవ్ర నిరసన చెప్పాయి. మోదీకి వీసా ఇచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది. 2002 హింసాకాండ ఆ ఏటి ఎన్నికలలో గెలుపునకు దోహదం చేయగా, మోదీ కొత్తగా అందుకున్న అభివృద్ధి అజెండా 2007లో ఆయనను గెలిపించింది. అయినా, 2002 ఆయనను, అమిత్‌షాను, ఆనాటి అధికారులను వెంటాడుతూనే ఉన్నది.

దేశంలోని అనేక రాష్ట్రాలు మోదీని అవాంఛనీయ వ్యక్తిగానే చూస్తూ వచ్చాయి. మరొకవైపు, మోదీలో ఏదైతే ప్రతికూల అంశమని అనుకున్నారో, దాన్నే ఆరాధించే ధోరణి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ముస్లిములకు బుద్ధిచెప్పిన నాయకుడిగా, శీఘ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రిగా ఒక జమిలి వ్యక్తిత్వం మోదీకి ఆపాదిస్తూ, ఆయన ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు జరిగాయి. పార్టీలో కూడా అతని ప్రాబల్యం పెరిగిపోయింది. కాంగ్రెస్‌ వంటి అనుభవశాలి అయిన పక్షమే ఈ క్రమాన్ని సరిగా అంచనా వేయడంలో విఫలం అయింది. మతతత్వం పై సూత్రబద్ధ వైఖరి లేకపోవడం, తరచు దానితో రాజీపడడం, తరచు తాను కూడా దాన్ని ఆశ్రయించడం - ఈ కారణాలతో కాంగ్రెస్‌ పార్టీ మోదీ - షా ద్వయం ఎదుగుదలను నిలువరించలేకపోయింది.

మతతత్వ భావజాలం, నిర్దాక్షిణ్యమైన పరిపాలనాచర్యలు, ప్రచారవ్యూహం - ఇవన్నీ కలిసి భారత అధికార పీఠం మీద అత్యంత ప్రమాదకరమైన శక్తులను ప్రతిష్టించగలిగాయి. రానా అయ్యూబ్‌ పుస్తకం  చదువుతుంటే, ఈ క్రమం అంతా కాలక్రమంలో మన కళ్లముందు దులుతుంది. అనేక ఘటనల మధ్య కార్యకారణ సంబంధం అర్థమైపోతూ ఉంటుంది. 2002లో జరిగింది నిస్సహాయుల మీద దుండగులు జరిపిన మారణకాండ మాత్రమే కాదని, అనంతరం జరిగిన అనేక సంఘటనలు కేవలం స్థానికమయిన అవసరాల కోసం జరిగినవి కావని తెలిసిపోతుంది.

ఈ పుస్తకం పాత్రికేయరంగంలో వచ్చిన బాధాకరమైన మార్పులను కూడా మనకు బోధపరుస్తుంది. సంపాదకీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అసమగ్రంగా ఉన్నదని 'తెహెల్కా' యాజమాన్యం ఈ పరిశోధనను ప్రచురించలేదు. చెప్పిన కారణాలు ఏమైనప్పటికీ, వారు పర్యవసానాలకు భయపడి ఉంటారని ఊహించవచ్చు. 'తెహల్కా' చిన్న పత్రిక. అప్పటికే అది తన తాహతుకు మించిన పరిశోధనాత్మక కథనాలను అందించింది. కానీ, జాతీయస్థాయి దిగ్దంత పత్రికలు, మీడియా సంస్థలు కూడా రానా అయ్యూబ్‌ పరిశోధనకు ముఖం చాటు చేశాయి.

రాజకీయ పక్షపాతాలు మోతాదుకు మించిపోయి, మీడియా అధికారక్రీడలో భాగం కావడం ఈ మధ్య పెరిగిపోయిన ధోరణి. ప్రాంతీయ భాషా మీడియా కంటె ఇంగ్లిష్‌, హిందీ పత్రికలు, చానెళ్లు - కనీసం జాతీయ సమస్యల విషయంలో - ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఉంటాయన్నది గతంలోని మాట.

ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో రాజకీయాధికారానికీ, కార్పొరేట్‌ పెట్టుబడులకు సంబంధం గాఢమైంది. స్వతంత్ర మీడియా అన్నది అరుదు అయింది. సమాచారహక్కు చట్టరూపం తీసుకున్న తరువాత కూడా, సమాచార సాంకేతికత అనేక వెసులుబాట్లను కల్పిస్తుందన్న ఆర్భాటం తరువాత కూడా, సత్యానికి సంకెళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ వాస్తవ పరిస్థితిని ఖాతరు చేయకుండా, తనలో సాహసోపేతమైన పాత్రికేయురాలిని, సంకల్పబలం కలిగిన ప్రజాస్వామ్యవాదిని నిలుపుకున్న రానా అయ్యూబ్‌ అభినందనీయురాలు.


కె. శ్రీనివాస్‌
హైదరాబాద్‌,  సంపాదకులు ఆంధ్రజ్యోతి
అక్టోబర్‌ 27, 2016.


ప్రతులకు, వివరాలకు : 

 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com


Phone : 040 2767 8411


No comments:

Post a Comment