Sunday 14 June 2015

ఒక 'మావోయిస్ట్' ఖైదీ జైలు అనుభవాలు - సంకెళ్ళ సవ్వడి - అరుణ్ ఫరేరా 'కలర్స్ ఆఫ్ కేజ్' తెలుగు అనువాదం

సంకెళ్ళ సవ్వడి 

మానవ హక్కుల కార్యకర్త అరుణ్‌ ఫెరీరాను మే 2007లో నక్సలైట్‌ అన్న ఆరోపణతో నాగపూర్‌ పోలీసులు రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. ఆతరువాత కొద్ది మాసాల్లో ఇతరులతో కలిపి ఆయనపై మరెన్నో నేరాలను మోపారు. నేరపూరిత కుట్ర, హత్య, అక్రమ ఆయుధాలు, దొమ్మీ మొదలైన నేరాలను ఆయనకు ఆపాదించారు. మహారాష్ట్రలో అత్యంత పేరుపొందిన నాగపూర్‌ సెంట్రల్‌ జైల్లో ఆయనను బంధించారు.

    దాదాపు ఐదేళ్ల ఫెరీరా జైలు జీవిత అనుభవాల సారమే ఈ పుస్తకం. ఖైదీగా ఆయన పడ్డ చిత్రహింస, దెబ్బలు, అవినీతి వ్యవస్థ, తోటి ఖైదీల ప్రవర్తనా తీరు, క్రౌర్యానికి వ్యతిరేకంగా ఖైదీల్లో పెల్లుబికిన నిరసన, నిస్సహాయ స్థితితో కూడిన సాధారణ వాతావరణం, ఆశను సజీవంగా వుంచిన చిన్న చిన్న ఓదార్పులు మొదలైనవాటన్నింటి గురించీ ఆయన నిశితంగా, నిర్మొహమాటంగా అభివర్ణించడం మనం చూస్తాం.

    సెప్టెంబర్‌ 2011లో ఫెరీరా అన్ని ఆరోపణల నుంచీ విముక్తుడవుతారు. కానీ, జైలు గేటు బయట తెల్ల దుస్తులు ధరించిన పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనకు స్వేచ్ఛ మళ్లీ అందకుండా పోతుంది. అప్పుడు తన కోసం కొద్ది దూరంలో వేచివున్న కుటుంబ సభ్యులను క్షణమైనా చూడలేకపోతారు. చివరకు సాహసవంతులైన స్నేహితులు, కార్యకర్తల సహాయంతో తనను జైల్లో పెట్టేందుకు చేసిన ఆరోపణలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన విజయం సాధిస్తారు.

    ఊచల వెనుక అసలేం జరుగుతోందో చెప్పే వాస్తవిక గాధ ఈ 'కలర్స్‌ ఆఫ్‌ కేజ్‌' (   ). పాఠకులకు బాగా తెలిసిన సెల్యులాయిడ్‌ చిత్రం వంటిదో లేక నవల వంటిదో కాదిది. అలా అని కేవలం దుర్భర జైలు జీవితం గురించిన వివరణా కాదు. ఒక వ్యక్తి న్యాయం కోసం పట్టుదలగా చేసిన పోరాటపు,  మానవ సంకల్పం సాధించిన విజయపు అద్భుత సీయగాధ. 
.................

అరుణ్‌ ఫెరీరా ఈస్ట్‌ ఇండియా కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు. ముంబై మూలవాసీలకు చెందినవాడు. వాళ్ల గ్రామాలే ఆతరువాత అస్తవ్యస్తంగా విస్తరించిన మహానగరంలోని బస్తీలయ్యాయి. ఫెరీరా ముంబయిలో ప్రతిష్టాత్మక సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో డిగ్రీ చేశారు. విద్యార్థిగా వున్నప్పటి నుంచే కార్యకర్తగా పనిచేస్తున్నారు.

    ఫెరీరా కార్టూనిస్టు కూడ. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన వేసిన కార్టూన్లు పలు విద్యార్థి, కార్మిక పత్రికలలో, వివిధ ప్రచురణల్లో వెలువడ్డాయి. 2012లో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచీ ఫెరీరా రాజకీయ ఖైదీలూ, జైలు సంస్కరణలూ, ప్రజాస్వామిక హక్కుల కోసం మరింత క్రియాశీలంగా పనిచేస్తున్నారు.  ప్రస్తుతం న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. ముంబయిలో ప్రజాస్వామిక హక్కుల ఉద్యమ చరిత్రపై పరిశోధన చేస్తున్నారు. 

.........

"... చీకటి కొట్లులాగా పిలవబడే జైళ్ళలో అసలేం జరుగుతుంది? ఎలా గడుపుతారు అన్నన్ని యేళ్ళు? మనం ఎన్నడూ వినని ఒక కొత్త భాష. అది జైలు కే ప్రత్యేకం. అక్కడ మనం మనుషులం కాదు శాల్తీలం. ప్రతిరోజూ మూడు సార్లు లెక్కల్లో తేలాక, గిన్తీలు, తలాశీలు వంటి రొటీన్లతో, ములాకాత్‌లు, తారీఖ్‌ లు వంటి విశేషాలతో, ''గిరాదేంగే'', ''పీ.సీ.ఆర్‌ కరాదేంగే'' వంటి ధమ్కీలతో ఆశ నిరాశల మధ్య ఉద్వేగాలు, అప్పుడప్పుడు కొన్ని ఉత్సాహాలు, ఎదురుచూపులు, అనేక దిగుళ్ళు ఎన్ని ఉన్నా ఖైదీని చివరవరకు నిలిపి ఉంచేది 'ఆశ' ఒక్కటే. వాటి తాలూకు రంగులన్నీ అరుణ్‌ పుస్తకంలో ప్రతి పేజీలోను కనపడతాయి.

ఇలాంటి పరిస్థితులని, నిరాశా నిస్పృహ కలిగించే జైలు వాతావరణాన్ని భరిస్తూ కూడా అరుణ్‌ కానీ, తన సహచర రాజకీయఖైదీలు కానీ తమ సెన్సాఫ్‌ హ్యూమర్‌ని ఏమాత్రం కోల్పోలేదు. అక్కడ జరిగే ఇటువంటి వాటికి కాలేజీ విద్యార్థుల్లాగా ముద్దు పేర్లు పెట్టుకోవడం...
అక్కడ జరిగే తతంగాలను వర్ణించేటప్పుడు కూడా ఆ హాస్యం, ఆ వర్ణనలు అంత బాధలోనూ నవ్వు తెప్పిస్తాయి. నిజానికి రాజకీయ ఖైదీలకి ఎప్పుడూ బలం అదే. ఎలాంటి పరిస్థితిలోనైనా నవ్వగలగడం....
అరుణ్‌ వేసిన 'ఆశ' అనే చిత్రంలో లాగానే చీకటి కొట్టులాంటి జైలు జీవితం గురించీ, అందులో నుండి లాల్‌ గేట్‌ బయట పరుచుకొన్న రంగుల ప్రపంచం (అదీ ఒక పెద్ద జైలు లాంటిదే అయినప్పటికి) గురించీ మనతో పంచుకొన్నభావోద్వేగాలే సంకెళ్ళ సవ్వడి."
                                                                                          - బి. అనూరాధ 
              (పంజరం లో రంగుల ఆకాశం - ముందుమాట నుంచి)

ఒక 'మావోయిస్ట్' ఖైదీ జైలు అనుభవాలు 
సంకెళ్ళ సవ్వడి 

- అరుణ్ ఫరేరా 

ఆంగ్ల మూలం : 'COLOURS OF CAGE' by Arun Farreira
తెలుగు అనువాదం : ఎన్. వేణుగోపాల్ 

ISBN : 978-93-85076-01-5

171 పేజీలు , వెల : రూ. 150 /- 

ప్రతులకు: 
మలుపు, 2-1-1/5 , నల్లకుంట, హైదరాబాద్ - 500044 

E MAIL ID : malupuhyd@gmail.com

Phone : 040 2767 8411





 

No comments:

Post a Comment