Saturday 26 August 2017

వంద వసంతాల బోల్షివిక్‌ విప్లవం సందర్భంగా 'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' - అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు


యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం
మూలం : వార్స్‌ అన్‌వుమెన్లీ ఫేస్‌ , ఎస్‌. అలెక్సీయెవిచ్‌
అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

బైలోరష్యాకి చెందిన అలెక్సీయెవిచ్‌ స్వెత్లానా 1948లో జన్మించింది. 1967లో బైలోరష్యన్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయం లో చేరింది. 1972లో జర్నలిస్టు విభాగంనుంచి పట్టభద్రు రాలైంది. బైలోరష్యా రిపబ్లిక్‌ జిల్లా, తాలూకా పత్రికల్లో పనిచేసింది.

ఈమె సోవియట్‌ యూనియన్‌ రచయితల సంఘ సభ్యురాలు. ఈమె రచించిన ''యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం,'' ''ఆఖరి సాక్షి'' (యుద్ధం గురించి పిల్లల కథనాలు) అనే పుస్తకాలు విశేష ప్రాచుర్యం పొందాయి. ''యుద్ధం స్త్రీ ప్రకృతికి
విరుద్ధం''ను అనేక భాషల్లోకి అనువదించారు, డాక్యుమెంటరీ సినిమాలు తీశారు, నాటకాలుగా మలిచారు.

''యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం'' యుద్ధంలో పాల్గొన్న స్త్రీల కథనాలు.
అవి కథలూ, గాథలూ కావు, బాధాకరమైన భావోద్వేగాలు.

1941లో వధువులు కావాలని బంగరు కలలు గన్న బాలికలు ఎలా సైనికులయ్యారో యిందులోని కథనాలు చెప్తాయి. 20వ శతాబ్దిలో సంభవించిన అత్యంత దారుణమైన రెండవ ప్రపంచ యుద్ధంలో 8 లక్షల మందికి పైగా సోవియట్‌ మహిళలు పురుషులతో సరిదీటుగా పాల్గొన్నారు.

స్త్రీలు క్షతగాత్రులను రక్షించి, కట్లుకట్టడమే కాకుండా, కాల్పులు జరిపారు, వంతెనలు పేల్చారు, శత్రువుల ఆనుపానులు తెలుసుకొనేందుకు వేగు చర్యలు సాగించారు, తమ మాతృదేశం మీద, తమ ఇళ్లమీద, తమ బిడ్డలమీద కనీవినీ ఎరుగని క్రౌర్యంతో దాడిచేసిన శత్రువులను చంపారు.

రచయిత్రి యీ పుస్తక రచనకోసం నాలుగేళ్లు అవిరామంగా శ్రమించింది. నూటికి పైగా నగరాలు, పట్టణాలు, పల్ల్లెలు, జనావాసాలు పర్యటించి, యుద్ధంలో పాల్గొన్నవాళ్ల కథనాలు సేకరించింది. అయితే వాటిలో ముఖ్యమైనవి యుద్ధ రంగంలో జరిగిన ఘటనలు కావు, యుద్ధంలో స్త్రీల గుండెల్ని పిండివేసిన అనుభవాలు.

ఈ ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా గతం నుంచి వర్తమానం నేర్చుకోవలసిన గుణపాఠాల పైకీ, నాటి, నేటి ఫాసిజం పైకీ, యుద్ధాన్ని నివారించవలసిన అవసరం పైకీ పాఠకుల దృష్టి ఆకర్షిప బడింది.

- ప్రగతి ప్రచురణాలయం, సోవియట్‌ యూనియన్‌, 1988


వంద వసంతాల బోల్షివిక్‌ విప్లవం సందర్భంగా
'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' -

మూలం : వార్స్‌ అన్‌వుమెన్లీ ఫేస్‌ , ఎస్‌. అలెక్సీయెవిచ్‌

అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

మొదటి ముద్రణ : ప్రగతి ప్రచురణాలయం, సోవియట్‌ యూనియన్‌, 1988

 మలుపు ప్రచురణ : ఆగస్టు 2017

పేజీలు : 112
వెల : 100/-

ప్రతులకు:  
మలుపు 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

Tuesday 22 August 2017

స్వేచ్చ కోసం ఒక అడవి బిడ్డ చేసిన వీరోచిత పోరాట గాధ "రాగో". రచన : సాధన; తొలి ప్రచురణ : సృజన, మలి ప్రచురణ : మలుపు


రాగో (నవల)
రచన : సాధన 

ఆకాశంలో సగం కోసం

భారతదేశంలో సుమారు పదకొండు కోట్ల మంది ఆదివాసులు జీవిస్తున్నారు. భారతదేశంలో వర్గ సమాజం రూపొందుతున్న క్రమం నుండి ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య శక్తులకు లొంగిపోయిన ఆదివాసులు వాళ్ళ ఆర్థిక హోదాను బట్టి కులహోదాను సంతరించుకున్నాయంటారు కోశాంబి. ఈ పోరాటాల చరిత్ర అట్లా ఉంచితే - ఈ ఘర్షణ లొంగుబాట్లలో ఆదివాసి జీవితంలో మనిషిని అణచిపెట్టే ఖాయిదాలు (సంప్రాదాయాలు) అనేకం వచ్చాయి. ఫలితంగా ఈ ఆదివాసులు సమస్త పీడనలను, దోపిడీని ఎదురించాలంటే తమతో తాము - సమస్త పీడలను కాపాడే రాజ్యంతో పాటు యుద్ధం చేయవల్సిందే. అలాంటి యుద్ధంలో ఆదివాసులను సమీకరించడం కోసం
దండకారణ్యంలో 1980 నుండి విప్లవకారులు కృషి చేస్తున్నారు.

ఈ  క్రమంలో ఎదురైన అనుభవాలను తమకు సాధ్యమైన రీతిలో సాహిత్యీకరించ డానికి అలాంటి పనిలో ఉన్నవాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి సాహిత్యకారుల్లో అనేక వ్యాసాలు, సరిహద్దు, రాగో (గోండి భాషలో రామచిలుక) రాసిన సాధన కృషి చెప్పుకోదగినది.

సమస్త కళలు, సాహిత్యం అస్థిత్వంలో ఉన్న అధికార రాజ్యపు భావజాలంతోనే నిండి ఉంటాయి. ప్రజాపోరాటాల నేపథ్యంలోనే ప్రజా సాహిత్యం వస్తుంది. ప్రజా పోరాటాల స్థాయియే ప్రజా సాహిత్యపు తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. ప్రజా పోరాటాలను గుర్తించి నడిపించే శక్తులే ఇలాంటి సాహిత్యాన్ని ఆదరిస్తారు. ఈ స్థాయి, సందర్భము అర్థం కాకుంటే సాహిత్యం గురించి విడిగా ఆలోచించి చాలా మంది గాభరపడుతారు.

సాధన రచయితగానే కాకుండా అతను సాహిత్యం ద్వారా అన్వేషించిన ప్రశ్నలు, చెప్పిన అనుభవాలు బహుశా సాహిత్యం చదివే చాలా మందికి కొత్త.

ఆదివాసుల గురించి వచ్చిన సాహిత్యం మిగతా సాహిత్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుక్కారణం వాళ్ళు అనేక సంవత్సరాలుగా సభ్య సమాజానికి దూరంగా ఉండడమే. బీహార్‌ ముండా ఆదివాసుల గురించి మహాశ్వేతాదేవి ఒరిస్సాలోని జాతావుల గురించి గోపీనాథ్‌ మహంతి లాంటి వాళ్ళు నవలలు రాశారు. ఈ సాహిత్యం వ్యక్తులుగా ఆదివాసి జీవితాన్ని దర్శించిన తీరు తెలుపుతుంది.

కాని 1980 తరువాత అడవి ప్రాంతాల్లోకి విస్తరించిన ప్రజాపోరాటాలు ఆదివాసి జీవితంలోని సమస్య వైరుధ్యాలను అధ్యయనం చేయవల్సి వచ్చింది. ఈ అధ్యయనపు నేపథ్యంలోనే - సాహు - అల్లం రాజయ్య గోండుల జీవితం మీద కొమురం భీం నవల వచ్చింది. ఈ నవల ఆదివాసి ప్రాంతంలోని రాజ్యాన్ని, దోపిడిని చర్చించింది. ఈ దోపిడి రాజ్యంతో ఆదివాసులు సాగించిన పోరాటంలోని వైఫల్యాలను విశ్లేషించింది. అంతకన్నా భిన్నంగా నడుపాల్సిన పోరాట ఆవశ్యకతను గుర్తించింది.

ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసులను దోపిడి చేయడానికి బయటి శక్తులెట్లా చొరబారి నిలదొక్కుకున్నాయో వసంతరావుదేశ్‌ పాండే నవల అడివి చర్చించింది. సాహు రాసిన అనేక కథలు, పాటలు, వ్యాసాలు జరుగుతున్న ఆదివాసి పోరాటాలను ఎప్పటికప్పుడు చిత్రించాయి.

అడవిలో వెన్నెల కథా సంకలనం ఇలాంటి కథలతో వచ్చింది.పులి ఆనంద్‌ మోహన్‌ నవల వసంతగీతం ఆదివాసి జీవితానికి - మైదాన ప్రాంతంలోని ఆదివాసియేతర జీవితానికి ఉండే సంబంధాన్ని, రాజ్యం తన సమస్త అంగాలతో ఈ రెండు ప్రాంతాలల్లోన్ని జనాన్ని ఏ విధంగా అణచి వేస్తున్నదో? అక్కడ కాలూనుతున్న పోరాటాలు ఎంత చిన్నవైనా దోపిడి యంత్రాంగం ఏ విధంగా కదిలిపోగలదో ఇరుపక్షాల చరిత్రను చిత్రీకరించింది.

సాధన నవల సరిహద్దు 1985 తర్వాత కాలానికి సంబంధించినది. 1985 తరువాత విప్లవ ఆచరణలో వచ్చిన అధ్యయనం ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో సాధన ఆదివాసియేతర - ఆదివాసి అనుభవాల సారాంశం ఈ నవల నిండా కన్పిస్తుంది. విప్లవ సాంప్రదాయిక సాహిత్యంలో ఉండే కాల్పనికత - బోధనల నుండి జఠిలమైన యాతన, పీడనల సమాజంలోని అనేక అంశాలను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని ఈ నవల ప్రతిపాదిస్తుంది. రూపం, భాష తదితర విషయాలల్లో సరిహద్దు నవల సాధన మొదటి నవల.సాధన రెండో నవల రాగో. ఒక రకంగా సరిహద్దు నవల కొనసాగింపులాగా కనిపిస్తుంది ఈ నవల. పాత్రలు కూడా చాలా వరకు రెండు నవలల్లో ఒకే పాత్రలు. కాని ఈ నవల వస్తువులో రూపంలో పూర్తిగా భిన్నమైనది.

రాగో యుక్త వయస్కురాలైన మాడియా గోండు యువతి. గోండుల్లో ఉన్న ఆచారం ప్రకారంగా రాగో చిన్నపిల్లగా ఉన్నప్పుడే రాగో తండ్రి పిల్ల నిస్తానని ఒక బీద యువకున్ని లామడే (ఇల్లరికం) తెచ్చుకున్నాడు. రాగో శారీరకం గానే కాక, మానసికంగా కూడా ఆ యువకున్ని ఇష్టపడలేదు. అదే గ్రామంలోని మరొక పెళ్ళయిన యువకునితో రాగోకు సంబంధం కలిసింది (బహు భార్యాత్వం ఉంది). పెళ్ళి కాదంటే రాగో తండ్రి లామడే యువకునికి అన్ని సంవత్సరాలకు జీతం కట్టాలి - బలవంతపు పెళ్ళి నుండి తప్పించుకొని కోరుకున్న వాని ఇల్లుసొచ్చింది అతను ఉంచుకుంటే ఆ యువకుడికి జీతం ఇచ్చుకోవాలి. కోరుకున్నవాడు భయపడ్డాడు. రాగోను పశువును బాదినట్లు బాదుతూ మళ్ళీ తీసుకవచ్చారు. రాగో ఈ దుర్మార్గమైన ఖాయిదాను ఖాతరు చెయ్యదలచుకోలేదు. తప్పించుకున్నది. అడవిలో చెట్లు పుట్టలు పట్టి తిరిగింది. చివరకు స్నేహితురాలు ఇల్లు చేరుకున్నది. మళ్ళీ తండ్రికి దొరికింది. మళ్ళీ తన్నులు గుద్దులు. మళ్ళీ రాగో తప్పించుకున్నది.

ఈసారి మాడియా మనుషులేకాదు మనుషులంతా దుర్మార్గులేనని వ్యక్తులుగా మంచివాళ్ళుగానే ఉన్నా? తనలాగే పెనుగులాడినా చివరకు ఖాయిదా వాతబడి మనుషులపట్ల ముఖ్యంగా స్త్రీలపట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని ఆలోచించింది. అడివిలో తిరుగుతూ తనకు పరిచయమున్న సమస్త మానవ సంబంధాల గురించి ఆలోచించింది. ఆ విధంగా దారితెన్ను కానకుండా తిరుగుతున్న దశలో దళంతో కలిసి - అక్కడి నుండి రాగో దళ జీవితంలో ఊపిరి సలుపకుండా తిరుగుతుంది. తనొక్కతే అనుభవించిన క్షోభ - స్వేచ్ఛ కోసం పడిన ఆరాటం మాడియా స్త్రీలందరిలోనూ చూస్తుంది. ఈ బాధలు ఖాయిదాల స్వరూప స్వభావాలు - అవి మొత్తం ఆదివాసి జీవితంలో పెనవేసుకపోయిన తీరు అర్థం చేసుకుంటుంది. పార్టీ సభ్యత్వము, తండ్రి రాగోను ఆమోదించడంతో నవల ముగుస్తుంది.

ఈ నవల రాగో లేవనెత్తిన ప్రశ్నల రూపంలో ఆదివాసి ఖాయిదాలకు సంబంధించినట్టు కన్పించినా ఇవి ప్రపంచ ప్రజలవి. ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న స్త్రీలకు సంబంధించినవి.

సకల మానవ సృష్టిని, వ్యక్తీకరణను నియంత్రించే క్రమంలోనే రాజ్యం తనను తాను నిలబెట్టుకున్నది. రాజ్యం తన మనుగడ కోసం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వ్యక్తీకరణను నియంత్రించే నిర్మాణ రూపాలను రూపొందించుకున్నది. అలాంటి నిర్మాణ రూపంలో చాలా పురాతనమైనది, సంక్లిష్టమైనది, జటిలమైనది ఇంతవరకు జరిగిన వర్గపోరాటాల్లో కూడా మిగిలి ఉన్నది కుటుంబం. అయితే రాజ్యంతో మానవులు జరిపిన పోరాటాల చరిత్ర తెలిసినంతగా మానవులు కుటుంబంతో జరిపిన పోరాటాల చరిత్ర (ఒక్క టాల్‌స్టాయ్‌ అన్నా కెరీనా తప్ప) ముఖ్యంగా భారతీయులకు కొత్త. ఉత్పత్తి, పునరుత్పత్తి, లింగ భేదాలతో పాటు అనేక పీటముళ్ళతో ఈ చరిత్ర నిండి ఉన్నది. అయినా అనివార్యంగా ఈ కుటుంబంతో, కుటుంబంలో మానవులు ఎడతెగని ఒంటరి పోరాటాలు చేస్తున్నారు. మనం ఇప్పటి దాకా చూసిన అన్ని రకాల సమాజాలల్లో ఈ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. కుటుంబం పురుషుల కన్నా స్త్రీలను దాదాపు సంపూర్ణంగా అణచివేసింది.

కుటుంబంలో జరిగిన భయంకర యుద్ధంలో స్త్రీలదే ప్రధాన పాత్ర.రాగో ప్రశ్నలన్నీ ఇట్లాగా నిర్మితమై కొనసాగుతున్న కుటుంబానికి సంబంధించినవి. రాగో రామచిలుకలాగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురాలనుకున్నది. మనిషిని మనిషి చేరుకోవడానికి ఉన్న సమస్త అడ్డంకులను ప్రశ్నించింది.

అయితే ఇలాంటి స్వేచ్ఛకు వ్యక్తీకరణకు సంబంధించిన రాగో దళంలో చేరడంతో అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిందా? మహా అయితే ప్రశ్నలు మరింత జటిలమయ్యాయి. దళంలో తిరిగి విప్లవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనుషుల   సమస్త బంధనాలు త్రెంచేయగలమని రాగో తనకు తాను జవాబు చెప్పుకున్నదా? దళంలో ఉండే ఇతర సభ్యులందరికి ఇలాంటి ప్రశ్నలున్నాయి. తీరిక లేని దళ కార్యక్రమంలో తిర్గడానికి - ప్రజాపోరాటాలు నిర్ణయించడానికి మధ్య చర్చించని అగాధం - చాలా ముఖ్యమైనవి.

ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త ఉద్రిక్తతలతో యాతనలతో విసిగి వేసారి జనం తమ సంపూర్ణ వ్యక్తీకరణ కోసం, స్వేచ్ఛ కోసం పోరాడడానికి సిద్ధపడతారు. ఇలాంటి స్వేచ్ఛను ఆర్తితో పట్టించుకొని నూతన ప్రజాస్వామిక విప్లవాచరణలో ఓపికగా నడిపించగల్గినప్పుడే సమస్త పీడనలు పోవడానికి మార్గం సుగమమౌతుంది.అడవిలో ఒంటరిగా తిరుగుతూ రాగో వేసిన ప్రశ్నలు నిజానికి దళం ముందు చెప్పనేలేదు. బహుశా ఆ వొత్తిడిని తట్టుకోలేక దారీతెన్నూ కానక దొరికిన దారిలో నడిచిందేగాని అదే అసలైన దారి అని పూర్తిగా నమ్మలేదు. అట్లని అంతకన్నా రాగోను మనిషిగా ఇదివరకు పరిగణించిన వారూలేరు.

రాగోలాగే మనుషులంతా ఎగురాలనే తీవ్రమైన అన్వేషణలో ఉన్నారు. వెతుకులాటలో ఉన్నారు...
తన్ను తాను తెలుసుకోవడమే కాదు. తనలాంటి వాళ్ళను తనతో పాటు రాగో తీసుకపోగలదా?
ప్రపంచం అతలాకుతలంగా ఉన్న ఈ సంక్షుభిత సమయంలో భవిష్యత్తు రాగో మీద ఆధారపడి ఉన్నది.

- యస్‌. పి. వసంత
(ముందుమాట )

రాగో (నవల)
రచన : సాధన


మొదటి ముద్రణ : నవంబర్‌, 1993, సృజన ప్రచురణలు
మలుపు ప్రచురణ పునర్ముద్రణ ఆగస్టు 2017

పేజీలు : 144
వెల : 120/-


ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com