Thursday 27 July 2017

తలకిందుల లోకం మూలం : కాఫ్కాలాండ్‌ - మనీషా సేఠి, తెలుగు అనువాదం : ఆర్‌. శశికళ

తెలుగు ప్రచురణకు ముందుమాట
అత్యవసరమైన చర్చ 
- జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి 

తీవ్రంగా కలత పెడుతున్నప్పటికీ, చదవమనీ, లోపల ఇంకించుకొమ్మనీ, ఏదో ఒక చర్యకు పూనుకొమ్మనీ ఒత్తిడి పెట్టే పుస్తకాలు అంత తరచుగా ఏమీ రావు. మనీషా సేఠీ రాసిన, ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం, 'కాఫ్కాలాండ్‌ - ప్రిజుడిస్‌, లా అండ్‌ కౌంటర్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా' తప్పనిసరిగా ఆందోళన పరిచేది. కాని అదే సమయంలో ఈ పుస్తకం ఆశను కూడ రేకెత్తిస్తుంది. అది లేవనెత్తుతున్న సమస్యలను ఎంత తక్షణం పరిష్కరించవలసి ఉన్నదో తెలియజెపుతుంది. దేశం బలమైన ఫాసిస్టు పాలనా పద్ధతివైపు నిరాటంకంగా ప్రయాణిస్తున్నదని ప్రగతిశీల శక్తులలో పొడసూపుతున్న అనుమానపు ఛాయలు, వాస్తవికమైనవేనని నేననుకునేవి, ఉన్నప్పటికీ ఇటువంటి పుస్తకం ప్రచురణ కావడమే, ప్రజలందరికీ విరివిగా అందుబాటులోకి రావడమే, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల రక్షణకు స్థలం ఇంకా మిగిలి ఉన్నదనీ, సకారణమైన, హేతుబద్ధమైన చర్చకు అవకాశం ఉందనీ, ఆశను రేకెత్తిస్తున్నాయి. ధైర్యంగా ఇటువంటి పుస్తకం రాయడానికి, బహిరంగంగా తన పేరుతో ప్రచురించడానికి సిద్ధంగా ఒక రచయిత ఉన్నారనే వాస్తవమే ఆ ఆశను బలోపేతం చేస్తుంది. సాధారణంగా మూకదాడులతో కలిసి, లేదా రాజ్య యంత్రాంగంతో కలిసి, అసహనం ప్రదర్శించడమే, వాదనలను పరిష్కరించుకోవడానికి ఏకైక వ్యక్తీకరణ సాధనంగా ఉన్న సమయంలో, రాజ్యాంగ విలువల పట్ల లోతైన, విధేయమైన విశ్వాసాన్ని ప్రకటించేవారి గళాలను నొక్కివేయడం, కుత్తుకలను కత్తిరించడం ఏకైక వ్యక్తీకరణ సాధనంగా ఉన్న యుగంలో సానుకూల మానవ పర్యవసానాలను పరిరక్షించే ఈ కృషి వీరోచితమైనదనిపిస్తుంది.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా అనే పేరుతో భద్రత అనేదాన్ని ఎలా సంభావిస్తున్నారో, ఎలా నిర్వహిస్తున్నారో కాఫ్కాలాండ్‌ ఎన్నో భిన్నమైన వాస్తవాలతో, ఉదంతాలతో, ఘటనలతో, ఆరోపణలతో చూపుతుంది. వాటన్నిటి నిజానిజాలను వ్యక్తిగతంగా పరిశీలించే అవకాశం నాకు లేదనేది స్పష్టమే. అది ఒక అసాధ్యమైన పని అవుతుంది. కాని, నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో, జాతీయ భద్రత పేరుతో హక్కుల ఉల్లంఘనలు జరిగిన ఇటువంటి ఘటనలతో వ్యవహరించిన వ్యక్తిగా, మనీషా సేఠీ ఈ పుస్తకంలో వర్ణించిన ఘటనలు జరిగి ఉండవని అనలేను. దానితో నా విచారం మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే మన రాజ్యాంగ పథకం అమలులో వ్యవస్థ వైఫల్యం గురించిన ప్రశ్నలను అది లేవనెత్తుతుంది. ఈ పుస్తకం వివరిస్తున్న సమస్య పరిమాణమూ వైశాల్యమూ చూస్తే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించవలసి ఉందని అర్థమవుతుంది. ఆ పరిష్కారం కేవలం ఏకాంత దంత ప్రాకారాలలో అమూర్త చర్చల స్థాయిలో మాత్రమే కాదు. మన వ్యవస్థలలో ప్రతి నిర్మాణం పట్ల శ్రద్ధ ఉన్న పౌరులందరూ, మన సామాజిక-రాజకీయ చర్చా సందర్భాలన్నిటిలోనూ ఆ చర్చ జరపవలసి ఉంది.

ఈ పుస్తకం ఇతివృత్తపరంగా మూడు భాగాలుగా రూపొందింది. బహుశా త్రీ ఎస్సేస్‌ కలెక్టివ్‌ అనే ప్రచురణకర్తల కోరిక మేరకు ఈ నిర్మాణం రూపొంది ఉండవచ్చు. కాఫ్కాలాండ్‌ అనే శీర్షికతో ఉన్న మొదటి భాగం తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేసిన కొన్ని నిర్దిష్ట ఉదంతాలను వివరించింది. నేరానికి శాస్త్రీయ సాక్ష్యాలుగా చూపే నార్కో అనాలిసిస్‌ పరీక్షలో రాబట్టిన జవాబులను కూడ మార్చిన డా. నార్కో చేతివాటం నుంచి, మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఎటిఎస్‌ అభియోగపత్రాన్ని తారుమారు చేసి, ఎన్‌ ఐ ఎ సాధించిందని చెపుతున్న సాక్ష్యాధారాల పర్యవసానాల దాకా, రచయిత జాగ్రత్తగా, సమగ్రంగా వాస్తవాలను పేర్కొన్నారు. ఇష్టారాజ్యపు అరెస్టులు, సాక్ష్యాధారాల తయారీ, కొన్ని సమూహాలను మొత్తంగా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం వంటి రూపాల్లో వ్యక్తమవుతున్న వ్యవస్థాగత దురభిప్రాయాల గురించి ఆమోదయోగ్యమైన వాదనలు చేశారు. వెంటాడుతారేమో అనే భయం గురించి, అమాయకుల భీతి గురించి, ''వ్యవస్థలకు బాధ్యులైన అధికారులే ప్రమాణాలను తారుమారు చేసే'' సౌలభ్యం గురించీ, ''భయభీతావహపు, అహంకారపూరిత దురుద్దేశాల ప్రాముఖ్యత'' గురించి ఆమె చేసిన చర్చలు అంతే బలంగా సాగాయి. ఒక న్యాయవాదిగానూ, ఒక న్యాయమూర్తిగానూ, నేను న్యాయం సక్రమంగా అమలు కాకపోతే జరిగే పర్యవసానాల గురించి పరిశుద్ధమైన న్యాయశాస్త్ర రూఢివాదంతో జరిగిన చర్చలు చాల తరచుగా విన్నాను. ఒక అమాయకుడికి శిక్ష విధించడానికి నిర్ణయించుకున్న రాజ్యాంగ యంత్రపు పాశవికత, ఒక అమాయకుడి నిస్సహాయ స్థితి ఈ పుస్తకంలో చాల అరుదైన దృష్టితో పట్టుకున్నారని చెప్పక తప్పదు.

రెండో భాగంలో సేఠీ ''రాజకీయ పాలకులకూ అధికారులకూ మధ్య కుదిరిన ఒడంబడిక''ను తేటతెల్లం చేశారు. ఆ అధికారులు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న విభిన్న సంస్థలకు చెందినవారు. ఆ ఒడంబడిక చట్టాన్ని చాల సులభంగా తలకిందులు చేసి, ఒక ఆచరణాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థను నిర్మించి, అమాయకులను బాధితులుగా మార్చడమే పనిగా పెట్టుకున్నది. దేశంలో అవసరమైన ఏకైక మానసికస్థితి యుద్ధంలో సైనికుడి మానసిక స్థితి మాత్రమేననే ఒక ఆలోచనాస్రవంతిని ప్రచార మాధ్యమాలలో సృష్టిస్తారు. దాని సాయంతో ''ప్రజా మేధావులు'', వ్యాఖ్యాతలు దేశం మొత్తానికీ ఒక తక్షణ ప్రమాదం పొంచి ఉన్నదని వాదిస్తారు. ఇక్కడ సేఠీ ఏమని ఆరోపిస్తారంటే, ''శక్తిమంతులు దేశాన్ని ఒక అనైతిక ఆచరణాత్మకత ప్రకారం నడుపుతుంటారు. అధికారం లేనివారు పిరికితనంతో భయపడుతూ జీవించాలి. వారికేమీ తేడా పడదు''. న్యాయస్థానాలలో జరిగిన వ్యాజ్యాల రూపంలోనూ, సంస్థలలో, బహిరంగా స్థలాలలో జరిగిన చర్చ రూపంలోనూ ఆధారాలెన్నో చూపించి సేఠీ ఒక బలమైన వాదన ముందుకు తెస్తారు. తీవ్రవాదమూ, అంతర్గత అసమ్మతీ తెస్తున్న సమస్యలను తాము ''మానవహక్కుల చర్చ'' వల్ల పరిష్కరించలేకపోతున్నామని చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజకీయ వ్యవస్థను లొంగదీశాయి. రాజఈయ వ్యవస్థ రాజ్యాంగ పథకాన్ని, రాజ్యాన్ని, దాని అంగాలను నియంత్రించే ఏర్పాట్లను త్యాగం చేసింది.

సేఠీ చేసిన ఈ నిర్ధారణ తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది. అది ప్రత్యేకంగా నాకెందుకు ఆందోళన కలిగిస్తుందంటే నేను ఈ రాజ్యపు మూలస్తంభాల్లో ఒకదానిలో పనిచేశాను. దేశంలో రాజ్యాంగ పథకాన్ని నిర్వచించడంలో, వ్యాఖ్యానించడంలో ముందువరుసలో ఉన్నాను. రాజ్యానికీ, రాజ్య సంస్థలకూ, రాజ్య అధికారులకూ మధ్య తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగా పని చేయాలనే ఒక ఒడంబడిక ఉన్నదని రచయిత ఉద్దేశిస్తున్నారనిపిస్తుంది. దేశంలో ఆంతరంగికంగా ముందస్తు భద్రతనూ, ప్రతిక్రియగా భద్రతనూ కల్పించవలసిన బాధ్యత ఉన్న సంస్థల అధికారులకూ రాజ్యానికీ మధ్య ఇటువంటి ఒడంబడిక ఉన్నదనడం మరింత విధ్వంసకరమైనది. ఈ ఒడంబడిక జాతీయ భద్రతా అధికారుల శిక్షాతీత, విచారణాతీత నేరప్రవృత్తిగా వ్యక్తీకరణ పొందుతుంది. అప్పుడిక ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో రాజ్య శక్తుల అత్యాచారానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమైనప్పుడు దాన్ని చల్లార్చడానికి చట్టాన్ని కపటత్వంతో ఒక సిగ్గుబిళ్లలా, సర్వరోగనివారిణిలా వాడుతుంటారని సేఠీ వాదిస్తారు. అది కూడ చివరికి విస్మరణకు గురవుతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష విధించాలని రాజకీయ వ్యవస్థ పట్టుపట్టదని ఆ అధికారులకు కూడ తెలుసునని ఆమె వాదిస్తారు.

సేఠీ రచనను ఎట్లా వ్యాఖ్యానించాలనే విషయంలో నేను రెండు ఆలోచనలు పంచుకోదలచాను. రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన హక్కులను కత్తిరించడానికి రాజ్యాధికారం తరచుగా ప్రయత్నిస్తున్నదనడం ఎంతమాత్రం కాదనడానికి లేదు. అలా జరగడం మనం అసంఖ్యాక సందర్భాలలో పదే పదే చూశాం. వ్యాజ్యాల న్యాయశాస్త్రం, అటు ప్రభుత్వ సంస్థలూ ఇటూ పౌరసమాజమూ సమర్పించిన లెక్కలేనన్ని నివేదికలు ఆ విషయానికి సాక్ష్యం చెపుతాయి. అయితే మనం అడగవలసిన ప్రశ్న, రాజ్యపు చరిత్రంతా అటువంటి వైఫల్య సందర్భాల చరిత్రేనా అని. రాజ్యాంగ ప్రణాళికను కొనసాగించే శక్తి ఎప్పుడూ లేనేలేదని, భవిష్యత్తులో కూడ దాన్ని సాకారం చేసుకోలేమని నిర్ధారించేదాకా పోగలమా అని.

అలా అనుకోవడం మన రాజ్యాంగ చరిత్రను అపసవ్యంగా అర్థం చేసుకోవడమేనని నాకు అనిపిస్తుంది. భారతదేశం పాలించడం కష్టమయ్యేంత అనంత సంక్లిష్టత కలిగిన దేశం. రాజ్యాంగ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, క్రియాశీలంగా పరిరక్షించడానికి అవసరమైన సామర్థ్యాలు నిరాకరించబడిన జనబాహుళ్యపు దేశం ఇది. అందువల్ల మన చరిత్రను మరింత జాగ్రత్తగా, సునిశితంగా మదింపు వేయవలసి ఉంటుంది. ప్రజాస్వామిక ప్రక్రియ ప్రజానీకంలో వేళ్లూనుకుని, బలపడినకొద్దీ రాజ్యమూ, రాజకీయ శిష్టవర్గాలూ ప్రతిస్పందించక తప్పదు, విధాన నిర్ణయాల పరిధిని విస్తరించక తప్పదు అని కూడ మనం గుర్తించాలి. ఇదేమైనా యథాలాపమైన విజయమా? కాదనే అనుకుంటాను. గతంలో కూడ నిరంకుశ ప్రభుత్వాలను న్యాయస్థానాలు సవాలు చేశాయి, ఎదిరించి నిలిచాయి, వ్యవస్థాగతమైన వివక్షను రద్దు చేసే సంస్కరణలలో కొన్నిటినైనా రాజకీయ వర్గాల చేత అమలు చేయించడంలో విజయం సాధించాయి. పాతుకుపోయాయని చాలమంది మేధావులు భావించిన పాలనలను కూడ సాధారణ ప్రజలు ఎన్నికల్లో దించివేసి సాహసోపేతమైన పాత్ర నిర్వహించారు. ఈ వాస్తవాలన్నీ ప్రగతిశీల చర్యల స్థూలమైన ఉదాహరణలు. ఇవి రాజ్యాంగ విలువలను సాధించే అవకాశాల ఆశాసూచికలు.

సేఠీ ప్రస్తావించిన ఎందరో బాధితులకు, అసలు ఎక్కడా గుర్తింపుకు రాకుండా ఉన్న మరెందరో లెక్కలేనంతమందికి ఇక్కడ నేను చెపుతున్నది రుచించకపోవచ్చుననేది, సరిపోదనేది స్పష్టమే. న్యాయాన్ని ఒక క్రమపరిణామపు, సామూహిక సందర్భంలో మాత్రమే గణనలోకి తీసుకోలేమని, తప్పనిసరిగా దాన్ని ఇక్కడ లక్ష్యంగా ఉన్న ప్రతి ఒక్క మానవజీవి స్థాయిలో, సమూహాల స్థాయిలో వ్యక్తీకరించవలసి ఉంటుందనీ అనేట్టయితే సేఠీ అభియోగాల పట్ల నేను మౌనం వహించకతప్పదు.

ఔను, నేను ఆశ గురించీ, తోసుకొచ్చే తొందరపాటు గురించీ కూడ రాశాను. మనను మనం నాగరిక మానవ జీవులుగా ప్రకటించుకునేవాళ్లం ఎవరమైనా పాటించవలసిన ఒక నైతిక కర్తవ్యాన్ని కూడ నేనిక్కడ కలపదలచాను. రాజ్యాంగ ప్రణాళికకు సంబంధించిన నైతిక మూలాన్ని మనం మన శరీరంలోని, ఆత్మలోని ప్రతి కణంతోనూ మన ఆలోచనల, ఆచరణల కేంద్రస్థానంలోకి తీసుకురావాలి. సేఠీ గుర్తించిన వ్యక్తుల వేదన, వారు అనుభవించిన భయోత్పాతం ఆ నైతిక కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. మన ఆచరణను నిర్దేశించడం కోసం వారు వేదనను అనుభవించారనే గ్రహచార ఆవశ్యకతను నేను నమ్మను. కాని వారి కడగండ్ల కథలన్నీ మనలో ఏమాత్రమైనా ఉన్న ప్రశాంతతను, సంతృప్తిని చెదరగొట్టవలసి ఉంది. నేను దీన్ని నైతిక కర్తవ్యంగా ఎందుకు చేరుస్తున్నానంటే, తోసుకొచ్చే తొందరపాటు అని ఎందుకు నొక్కి చెపుతున్నానంటే, భారతదేశంలో పూర్తిస్థాయి ఫాసిజం ప్రవేశిస్తున్న ప్రమాదసూచనలు కనిపిస్తున్నాయి గనుక.

ఇక కాఫ్కాలాండ్‌ లోని మూడో భాగం గురించి చెప్పవలసి ఉంది. ఈ భాగంలో సేఠీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు ప్రయోజనాలను వర్ణించారు. ప్రజలను భయోత్పాతంలో ముంచి, ఆ భయ సూచనలను అపరిమితంగా పెంచడం ద్వారా, సాధించే ప్రభుత్వ నిధులనుంచి ఆశ్రిత పెట్టుబడిదారులు లాభాలు పొందదలచుకున్నారు. ఈ సందర్భంలో సేఠీ చేసిన పరిశోధన మనను ఒక్కసారి కుదిపి, తక్షణ ప్రమాదాలు, అస్తిత్వ ప్రమాదాలు అనే వాదనలను, అందువల్ల ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావాలనే కోర్కెలను విమర్శనాత్మకంగా పరిశీలించమని ఒత్తిడి చేస్తుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానమంతా మరింతగా వ్యక్తిగత హక్కులను కత్తిరించే భయానకమైన మూల్యంతో రానున్నది.

భద్రతా అధిభౌతిక వాదన అనేదాన్ని వ్యక్తీకరిస్తున్నప్పుడు, సేఠీ ఆ విశ్లేషణను మరింత ముందుకు, మరింత లోతుకూ తీసుకుపోతారని నేను ఆశించాను. ముఖ్యంగా ఉదారవాదులు నెలకొల్పడానికి ప్రయత్నించిన రాజకీయార్థిక వ్యవస్థలో సామాజిక న్యాయ భావనను అనైతికమనే పేరుతో పక్కనపెట్టడం, పెరుగుతున్న అసమానతల సమస్యలు, తత్ఫలితంగా పుట్టుకొచ్చిన అభద్రతలు వంటి వాటిని విస్మరించడం, కేవలం అసూయా జనితమైన అనైతిక ఆలోచనలుగా ఖండించడం జరిగి, అది ప్రత్యక్షంగా  ''మానవహక్కుల వాళ్ల'' నైతిక అధికారం తగ్గిపోవడానికి దారితీసిందా పరిశీలించవలసి ఉంది. రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నప్పుడు డా. అంబేద్కర్‌ హెచ్చరించినట్టుగా, ఆర్థిక, సామాజిక భద్రతా ప్రణాళికను విస్మరించడమే రాజకీయ హక్కుల విధ్వంసానికి దారితీసిందని నేను భావిస్తాను. బహుశా ఆ మహానుభావుడు ఊహించిన చీకటి భవిష్యత్తులో పరాన్నభుక్కు పెట్టుబడిదారీ విధానపు పెద్దమనుషుల కోటు అంచులకు వేలాడే శక్తిమంతులు అధికారపీఠాలను అధిరోహించడం కూడ ఉన్నదేమో. మన ఆధునికానంతర తొందపాటులో, మనం వ్యక్తికి ఉన్న ప్రతిఘటనా సామర్థ్యాన్ని అది ఎంత వీరోచితమైనదప్పటికీ, అతిశయోక్తులతో ఊహించామేమో. అందువల్ల ఆమోదనీయమైన కనీస ఆర్థిక, సామాజిక న్యాయ స్థాయిలలో ప్రజాస్వామిక బృందాల, కూటములను ఏర్పాటు చేసే సామర్థ్యమూ, ప్రతిఘటనా వాదనలు జరిపే సామర్థ్యమూ ధ్వసంమైపోతుంటే నిర్లక్ష్యం చేశామేమో. రాజకీయ న్యాయాన్ని మాత్రమే విస్తరించడానికీ, సుస్థిరం చేయడానికీ ప్రయత్నించామేమో?

మన రాజ్యాంగం ఒక ఆత్మహత్యా పత్రం కాదు. చట్టం విధించిన పరిమితుల లోపల పౌరులకు భద్రత కల్పించడానికి రాజ్యానికి ఇచ్చిన బాధ్యత మీద ఆంక్షలు విధించేలా దాన్ని వ్యాఖ్యానించలేము. ఆ భద్రతను కల్పించే పనిలో చట్టాన్ని పక్కన పెట్టవచ్చుననే వాదనలు మరొక కొసన ఆత్యహత్యా సదృశమైనవే. అంటే మనం చట్టాన్నే ధ్వంసం చేయవలసి వస్తుంది. విధ్వంసశక్తులతో ఘర్షణలలో ఒక ప్రజాస్వామిక రాజ్యం ఆ చట్టాన్ని రక్షించడానికే అ యుద్ధాలు చేస్తుంది. మన రాజ్యాంగం పౌరులకు వాగ్దానం చేసిన న్యాయాన్ని సాకారం చేసే పరిధిలోనే చేస్తుంది. భద్రతను కల్పించే రాజ్య సామర్థ్యానికి చట్టమూ రాజ్యాంగమూ ఆటంకంగా ఉంటాయనే వాదనను కొనసాగిస్తే అసలు రాజ్యం ఏర్పడిన మూలకారణాన్నే కోల్పోయే జారుడుబల్ల మీద జారిపోతాం.

యుద్ధసమయంలో చట్టాలు మౌనం వహించాలని సిసిరో చేసిన వ్యాఖ్య సుప్రసిద్ధమే. ఎందరో మహానుభావుల భుజాల మీద నిలబడి, మానవ సమాజపు సంచిత వివేకం మీద ఆధారపడి మనం అనగలిగినదేమంటే సిసిరో మాట అక్షరాలా తప్పు అని. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక రాజ్యాల మౌలిక సూత్రం ఏమంటే రాజ్యం, దాని అంగాలు చేసే ప్రతి పనీ చట్టాలకు లోబడి ఉండాలనేదే. ఈ ఏర్పాటులో అతి కీలకమైన ఆవశ్యకత ఏమంటే యుద్ధశతఘ్నులు పేలుతున్నప్పుడు కవుల గొంతులు నొక్కడానికి వీలులేదు అని. ఎందుకంటే అసలు శతఘ్నులు పేలుతున్నాయా లేదా అంచనా కట్టడానికి, ప్రజాస్వామిక అధికార పగ్గాలు అప్పగించబడినవారు చట్టం పరిధి లోపల ప్రవర్తిస్తున్నారా లేదా మదింపు వేయడానికి వాళ్లు అవసరం. అందువల్ల, సేఠీ పుస్తకం ఇవాళ భారతదేశంలో అమలవుతున్న ''భద్రతా అధిభౌతిక వాదన'' స్వభావం గురించి ఒక సకారణమైన, సమంజసమైన చర్చకు దారితీస్తుందని నేను ఆశిస్తున్నాను. సేఠీ నిర్ధారణలతో మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కాని ఈ చర్చ అతి ముఖ్యమైనదని మాత్రం మనం అంగీకరించవచ్చు, అంగీకరించక తప్పదు.
(తెలుగు అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌)

మలుపు ప్రచురణ 

తలకిందుల లోకం
మూలం : కాఫ్కాలాండ్‌
మనీషా సేఠి
అనువాదం : ఆర్‌. శశికళ

 వెల : రూ. 150/-

ప్రతులకు : 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.

Email : malupuhyd@gmail.com

Friday 7 July 2017

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి - పునర్ముద్రణ వెలువడింది


మలుపు ప్రచురణ 

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

పునర్ముద్రణ వెలువడింది

మూలం : కర్ఫ్యూడ్‌ నైట్‌ - బషరత్‌ పీర్‌
అనువాదం : యార్లగడ్డ నిర్మల

వెల రూ. 170/-
ప్రతులకు : 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.

ఆరు దశాబ్దాలుగా నిత్య సంక్షోభంలో మునిగి ఉన్న కశ్మీర్‌ ప్రజల దుర్భర జీవన గాథ ఇది. జీవన్మరణ పోరాటాల కథ ఇది. దారుణ నిర్బంధ కాండ కథ ఇది. 

ఇటు భారత ప్రభుత్వ సైనిక బలగాల దౌర్జన్యాలకూ, అటు పాకిస్తాన్‌ ప్రేరిత మిలిటెంట్‌ సంస్థల దౌర్జన్యాలకూ మధ్య కశ్మీర్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార ఆకాంక్ష ఎట్లా అణగిపోతున్నదో ఎన్నెన్నో జీవితాలతో నిరూపించి చూపిన కథ ఇది. 

అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ, ప్రపంచ స్థాయి, ఇరుదేశాల ద్వైపాక్షిక స్థాయి సమావేశాల్లో ఎంత చర్చ జరిగినా, తమను ఆ చర్చల్లో ఎన్నడూ భాగం చెయ్యని పాలకవర్గ దుర్మార్గం మీద కశ్మీరీ ప్రజల్లో రగులుతున్న నిప్పు నిషిద్ధ రాత్రులను ఎలా వెలిగిస్తున్నదో చూపిన కథనం ఇది. 

సాధారణ జీవితం కోల్పోయిన లక్షలాది మంది ప్రజల ఆవేదనకు అక్షర రూపం ఇది.



Thursday 6 July 2017

ధ్వంసమైన స్వప్నం అరుంధతీ రాయ్‌ వ్యాసాలు - పునర్ముద్రణ వెలువడింది.

మలుపు ప్రచురణ : 

ధ్వంసమైన స్వప్నం
పునర్ముద్రణ వెలువడింది.

మూలం : బ్రోకెన్‌ రిపబ్లిక్‌
అరుంధతీ రాయ్‌ వ్యాసాలు

అనువాదం : 
చిదంబరం వార్‌ - ప్రభాకర్‌ మందార 
వాకింగ్‌ విత్‌ ద కామ్రేడ్స్‌ - పి. వరలక్ష్మి 
ట్రికిల్‌డౌన్‌ రెవల్యూషన్‌ - కడలి

ఫొటోలు : సంజయ్‌ కాక్‌ అండ్‌ అరుంధతీ రాయ్‌

చిదంబర రహస్యం
భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచీ కూడ దక్షిణ ఒరిస్సాలోని ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరస డోంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది.

కారడవిలో కామ్రేడ్స్‌తో
నా తలుపు కింది నుంచి లోపలికి తోసుకొచ్చిన క్లుప్తంగా టైప్‌ చేసిన చీటీ 'భారతదేశపు అతిపెద్ద అంతరంగిక భద్రతా సవాలు'తో నా కలయికను నిర్ధారించింది. వాళ్ల సందేశం కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నాను.
మానవజాతి మనుగడ కోసం విప్లవం
2010 జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్‌లోని మారుమూల అడవుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు చెరుకూరి రాజకుమార్‌ అనే వ్యక్తి ఛాతీలోకి తూటా దించారు. ఆ వ్యక్తి సహచరులకు ఆజాద్‌గా పరిచితుడు.

యుద్ధం భారతదేశపు సరిహద్దుల నుంచి దేశం గుండెకాయ అయిన అడవులకు తరలి వచ్చింది. అద్భుతమైన సమాచార వివరణనూ విశ్లేషణనూ మిళితం చేసిన భారదేశపు సుప్రసిద్ధ రచయితలలో ఒకరు ఈ పుస్తకంలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చోట ప్రగతి, అభివృద్ధి స్వభావాన్నీ పరీక్షిస్తున్నారు. అసలు ఆధునిక నాగరికత గురించే మౌలిక ప్రశ్నలు అడుగుతున్నారు.



ధ్వంసమైన స్వప్నం
అరుంధతీ రాయ్‌ వ్యాసాలు
వెల : 150/-

ప్రతులకు : 
నెం.  2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.